PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

credit: x


Last Updated:

ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు.

credit: x
credit: x

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ ఉన్నత స్థాయి భేటీలో పాలనా సంస్కరణలు, ప్రభుత్వ పనితీరు, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలపై ప్రధానంగా చర్చించారు. పాలనను మరింత వేగవంతం చేయాలని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని మోదీ మంత్రులకు స్పష్టం చేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. గత విజయాల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 నుండి మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఉన్నామని, భవిష్యత్తులో ప్రజల కోసం ఇంకా ఏం చేయగలమో ఆలోచించాలని చెప్పారు. అత్యంత వేగంగా ఫైళ్లను పరిష్కరించిన శాఖలను ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు.

ఇటీవల ముగిసిన ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీకి మంత్రులందరూ చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ పర్యటనల వ్యూహాత్మక ప్రాధాన్యతను, ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టను వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మూడో విడత పాలనలో రెండేళ్లు పూర్తయిన తరుణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రధాని కోరారు.

పాలనలో అలసత్వాన్ని తగ్గించి, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని మోదీ అధికారులను, మంత్రులను ఆదేశించారు. ప్రభుత్వ ఫైళ్లు ఏ రకమైన నిబంధనల సాకుతోనూ నిలిచిపోకూడదని, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. ప్రజలకు సేవలందించే ప్రక్రియను మరింత సరళతరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, అడవులు, కార్మిక, రహదారి రవాణా, కార్పొరేట్ వ్యవహారాలు, వాణిజ్యం, విద్యుత్ వంటి పలు కీలక మంత్రిత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను సమర్పించాయి.

పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధన వనరుల పెంపులో భాగంగా బయోగ్యాస్ రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. పశ్చిమ ఆసియా (గల్ఫ్) ప్రాంతంలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు, వాటి వల్ల అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రతి మంత్రిత్వ శాఖ ప్రజా సంక్షేమాన్ని పాలనా విధానాల కేంద్ర బిందువుగా చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *