Last Updated:
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల పండుగ సందర్భంగా ఫరియా అబ్దుల్లా చేసిన డాన్స్ పై మతం పేరుతో కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి రియాక్ట్ అయ్యారు ఫరియా.
‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘చిట్టి’గా చెరగని ముద్ర వేసిన టాలెంటెడ్ నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలపై మరోసారి స్పందించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల పండుగ సందర్భంగా ఆమె చేసిన డాన్స్ పై మతం పేరుతో కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమా ‘సిగ్మా’ (Sigma) విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ వివాదంపై ఫరియా తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతరలో ఫరియా అబ్దుల్లా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా పోతురాజులతో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే, ఒక వర్గం వారు ఆమెను మతం పేరుతో విమర్శించారు. దీనిపై అప్పట్లోనే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చిన ఆమె.. “నేను అంతటా, అందరిలోనూ భగవంతుడిని చూస్తాను” అని సున్నితంగా బదులిచ్చారు. తాజాగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. “మనం 2026వ సంవత్సరంలో, ఎంతో ఆధునిక యుగంలో జీవిస్తున్నాం. ప్రపంచం ఎంత ముందుకు వెళ్లినా, ఇంకా చాలామంది పాతకాలపు ఆలోచనలతోనే ఉండిపోవడం నన్ను కలచివేసింది. ఆ సమయంలో కొందరు వ్యక్తం చేసిన భావజాలం నన్ను బాధించింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడూ అభ్యుదయ భావాలతో, విశాల దృక్పథంతో ఆలోచిస్తానని ఫరియా స్పష్టం చేశారు. “నా పద్ధతులు నచ్చిన వాళ్లు నన్ను అనుసరిస్తారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. అందరి ఆలోచనలను నేను గౌరవిస్తాను. కానీ కారణం లేకుండా ట్రోల్స్ చేయడం సరికాదు” అని తనదైన శైలిలో ధీటుగా సమాధానమిచ్చారు.
ఇక ‘సిగ్మా’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Thalapathy Vijay) కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం విశేషం. విలక్షణ నటుడు సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఫరియా హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.














