Prithvi Shaw: స్టార్ క్రికెటర్‌కు షాక్.. ఆరు నెలలకే నిశ్చితార్థం రద్దు ! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భారత క్రికెటర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఇద్దరి లక్ష్యాలు వేరు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆకృతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఆరు నెలలకే వీరి బంధం బీటలువారింది.

News18
News18

టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్‌తో అతడి ఎంగేజ్‌మెంట్ అధికారికంగా రద్దయింది. ఈ ఏడాది మార్చి 8వ తేదీన వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. తామిద్దరం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పంచుకుని అభిమానులకు శుభవార్త చెప్పారు. కానీ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ జంట విడిపోవడం క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసింది.

తమ భవిష్యత్తు లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నందున పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగ ప్రకటన చేశారు. ఎంతో బాధతో ఈ కఠినమైన విషయాన్ని అందరితో పంచుకుంటున్నానని, తమ దారులు వేరైనా ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నెటిజన్లను కోరారు.

కలవరపెట్టిన పోస్టులు

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలలకే జులైలో ఆకృతి తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని అనుమానాస్పద పోస్టులు పెట్టారు. దీంతో ఇద్దరి బంధంలో మనస్పర్ధలు వచ్చాయంటూ అప్పట్లోనే జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ వార్తలపై ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. కానీ తాజాగా ఆకృతి చేసిన ప్రకటనతో ఆ ఊహాగానాలన్నీ నిజమేనని తేలిపోయింది. బాధ్యతలు, భవిష్యత్తు ప్రణాళికలు సరిపోలకపోవడమే ఈ విచారకరమైన నిర్ణయానికి ప్రధాన కారణమని ఆమె సున్నితంగా తెలిపారు. దయచేసి విడిపోవడానికి గల కారణాలపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

కెరీర్‌పై పృథ్వీ దృష్టి

పృథ్వీ షా ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ ఓపెనర్‌కు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ చేదు అనుభవం పెద్ద దెబ్బే. క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించేందుకే పృథ్వీ ఈ కఠిన నిర్ణయానికి అంగీకరించి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇద్దరూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని ఆకృతి మనసారా కోరుకున్నారు. అయితే, బ్రేకప్ విషయంపై పృథ్వీ షా మాత్రం ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *