Renigunta Railway Station: రేణిగుంట స్టేషన్‌లో గంటపాటు నరాలు తెగే ఉత్కంఠ.. రైలు పైకెక్కిన వ్యక్తి, చివరకు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో హైటెన్షన్‌ వైర్‌పై వ్యక్తి హల్‌చల్‌.. ఇంతకీ ఏం జరిగిందంటే..

+

News18

ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్ అది.. క్షణక్షణం రైళ్ల రాకపోకలతో, ప్రయాణికుల సందడితో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోట ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ప్రాణాలను క్షణాల్లో హరించే పచ్చటి హైటెన్షన్ కరెంటు తీగను పట్టుకునేందుకు ఓ వ్యక్తి చేసిన దుస్సాహసం ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. క్షణాల్లో జరగబోయే ఘోరాన్ని ఊహించుకుని ప్లాట్‌ఫాంపై ఉన్నవారంతా భయంతో వణికిపోయారు. ఉత్కంఠభరితమైన ఈ భారీ డ్రామా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుని అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో రేణిగుంట చేరుకున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ముందుగా ప్లాట్‌ఫాంపైకి దిగాడు. కొంతసేపు అక్కడ పెద్దపెద్దగా కేకలు వేస్తూ అటూ ఇటూ పిచ్చిగా తిరిగాడు. ఆ తర్వాత నేరుగా రైల్వే బ్రిడ్జి వైపు దూసుకెళ్లి, ఏమాత్రం భయం లేకుండా పక్కనే ఆగి ఉన్న ఓ రైలు పైకప్పుపైకి ఎక్కేశాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్రాణాలు తీసే హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్‌కు అతి సమీపంగా వెళ్లి, దానిని చేత్తో పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనను గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్‌ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. తద్వారా జరగబోయే పెను ప్రమాదాన్ని చాకచక్యంగా అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: Ganesh Laddu: వేలం పాడిన గణేశుని లడ్డూను ఏం చేస్తారు? 90 శాతం మందికి తెలియదు!

రైలు పైకప్పుపై ఉన్న ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌), జీఆర్‌పీ, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. దాదాపు గంటపాటు తీవ్ర ఉత్కంఠ నడుమ ఈ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. అతడు కరెంటు వైర్లను పట్టుకోకుండా కింద నుంచి అధికారులు ఎంతో ఓర్పుగా సముదాయించారు. భద్రతా కారణాల దృష్ట్యా కరెంటు సరఫరా నిలిపివేయడంతో రేణిగుంట స్టేషన్ మీదుగా సాగే వివిధ రైళ్ల రాకపోకలకు కొంతసేపు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించి తమ అదుపులోకి తీసుకోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Kisan News: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. రూ.20 వేలు మిస్ అవ్వొద్దు, వెంటనే ఇలా చేయండి!

అయితే కిందకు దిగిన తర్వాత ఆ వ్యక్తి అధికారులతో ప్రవర్తించిన తీరు తీవ్ర విస్మయానికి గురిచేసింది. పోలీసుల అదుపులో ఉంటూనే చట్టపరమైన నిబంధనల గురించి అనర్గళంగా మాట్లాడటం గమనార్హం. తనను అరెస్టు చేస్తే కచ్చితంగా 48 గంటల్లోగా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలని పోలీసులను డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా విచారణ కోసం తన వద్దకు కేవలం ‘త్రీ స్టార్‌’ స్థాయి అధికారి మాత్రమే రావాలని కండిషన్ పెట్టాడు. చనిపోవడానికి యత్నించిన వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా ఇలా చట్టాల గురించి మాట్లాడుతుండటం చూసి పోలీసులకు సైతం ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది.

అధికారుల సమయస్ఫూర్తి, కరెంటు సరఫరా వెంటనే నిలిపివేయడం, రెస్క్యూ బృందాల వేగవంతమైన సమన్వయంతో రేణిగుంట స్టేషన్‌లో ఈ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ప్రస్తుతం అదుపులో ఉన్న సదరు వ్యక్తి మద్యం మత్తులో ఈ విధంగా ప్రవర్తించాడా, లేక అతడికి మతిస్థిమితం సరిగా లేదా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిలా మాట్లాడుతుండటంతో అతడి నేపథ్యం గురించి పూర్తిగా ఆరా తీస్తున్నారు. అతడి అసలు ఉద్దేశం ఏమిటి, ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను రాబట్టే పనిలో రైల్వే పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed