Last Updated:
ఫుట్‌బాల్ మహా సంగ్రామం ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో ఆతిథ్య మెక్సికో తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మెక్సికో సూపర్ విక్టరీని సాధించింది.
FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) టోర్నమెంట్ ఘనంగా ఆరంభమైంది. అమెరికా, మెక్సికో, కెనడాలు వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గ్రూప్-Aలో భాగంగా జరిగిన తొలి ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆతిథ్య దేశం మెక్సికో ఘనవిజయం సాధించింది. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక ‘ఎస్టాడియో అజ్టెకా’ (Estadio Azteca) స్టేడియంలో సుమారు 83,000 మంది అభిమానుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాను మెక్సికో 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. అయితే, మ్యాచ్ అంతటా ఆటగాళ్ల దూకుడు కారణంగా ఏకంగా మూడు రెడ్ కార్డ్‌లు (Red Cards) నమోదు కావడం విశేషం.
మ్యాచ్ ఆరంభం నుంచే మెక్సికో దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ (Julián Quiñones) అద్భుతమైన గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో స్టేడియం అంతా హోరెత్తిపోయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారికి వరుస షాక్‌లు తగిలాయి.
మ్యాచ్ 50వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని అడ్డుకున్నందుకు సౌత్ ఆఫ్రికా ఆటగాడు యా యా సిథోల్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపేశారు. ఆ తర్వాత 84వ నిమిషంలో వీఏఆర్ (VAR) సమీక్ష అనంతరం థెంబా జ్వానే కూడా రెడ్ కార్డ్ అందుకోవడంతో సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 9 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.
మ్యాచ్ ముగిసే సమయానికి స్టాపేజ్ టైమ్‌లో ప్రత్యర్థి ఆటగాడిని ఫౌల్ చేసినందుకు మెక్సికో కెప్టెన్ సీజర్ మోంటెస్కు కూడా రెడ్ కార్డ్ రావడంతో మెక్సికో జట్టు కూడా 10 మందికి పడిపోయింది. అయినప్పటికీ మెక్సికో 2-0 తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది. మొత్తం 48 జట్లతో జూలై 19 వరకు సాగనున్న ఈ సుదీర్ఘ టోర్నమెంట్లో గ్రూప్-A నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ‘రౌండ్ ఆఫ్ 32’ (నాకౌట్ దశ) కు అర్హత సాధిస్తాయి. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి మెక్సికో గ్రూప్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













