Last Updated:
యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లోపాల కారణంగా ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ (NTA) ప్రకటించింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు ముందుగా నిర్ణయించిన ప్రకారమే వెలువడనున్నాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవల నిర్వహించిన యూజీసీ నెట్ (జూన్ 2026) పరీక్షల్లో భారీ స్థాయిలో తప్పులు దొర్లాయి. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్టీఏ తక్షణమే అప్రమత్తమైంది. ఈ ఫిర్యాదుల వాస్తవికతను పరిశీలించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీ సమగ్ర విచారణలో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో పెద్ద ఎత్తున అక్షర దోషాలు, అనువాద తప్పులు, వ్యాకరణ దోషాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముఖ్యంగా ప్రముఖ రచయితల పేర్లు తప్పుగా ముద్రించడం, పుస్తకాల పేర్లలో లోపాలు ఉండటం, పాత ప్రశ్నలే మళ్లీ మళ్లీ ఇవ్వడం లాంటి అనేక సాంకేతిక లోపాలను కమిటీ గుర్తించింది.














