TTD Food quality: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో ఇక మరింత నాణ్యత.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..! TTD annaprasadam quality | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో టీటీడీ అన్నప్రసాదం నాణ్యత పెంచేందుకు పప్పు మిల్లర్లతో సమీక్ష చేసింది, అధిక ప్రమాణాలు, పారదర్శక కొనుగోలు, పటిష్ట సరఫరాపై దృష్టి సారించింది

+

News18

ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అందించే శ్రీవారి అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక చర్యలు ప్రారంభించింది. భక్తులకు అందించే ప్రతి ఆహార పదార్థం అత్యున్నత ప్రమాణాలతో ఉండాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్ల ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో పప్పు దినుసుల నాణ్యత, సరఫరా విధానం, అవసరమైన పరిమాణం, కొనుగోలు ప్రక్రియ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. శ్రీవారి అన్నప్రసాదం కేవలం ఆహారం మాత్రమే కాకుండా భక్తులకు అందించే పవిత్ర సేవ అని పేర్కొన్న అదనపు ఈవో, ముడి సరుకుల ఎంపికలో ఎలాంటి రాజీకి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అన్నప్రసాదాల తయారీలో శనగలు, కందిపప్పు, పెసరపప్పు, మినుములు, వేరుశెనగలు తదితర ఏడు రకాల పప్పు దినుసులను వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులకు వడ్డించే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత అత్యంత కీలకమని, అందుకే సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్న బియ్యంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నామని, అదే విధంగా పప్పు దినుసుల విషయంలో కూడా అత్యుత్తమ ప్రమాణాలను అనుసరించాలని మిల్లర్లకు సూచించారు. భక్తుల విశ్వాసానికి తగిన విధంగా నాణ్యమైన సరుకులను మాత్రమే సరఫరా చేయాలని కోరారు.

ఈ సందర్భంగా స్పందించిన పప్పు మిల్లర్ల ప్రతినిధులు, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే టీటీడీ సేవలో భాగస్వాములు కావడం తమకు గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం తయారయ్యే ప్రసాదాలకు అత్యుత్తమ నాణ్యత కలిగిన పప్పు దినుసులను అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సమావేశం అనంతరం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత నియంత్రణ, సరఫరా వ్యవస్థ బలోపేతంపై అధికారులకు అదనపు ఈవో పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో కూడా భక్తులకు అందించే అన్నప్రసాదం నాణ్యత విషయంలో తిరుమల దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలన్న టీటీడీ సంకల్పానికి ఈ సమావేశం మరో నిదర్శనంగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports