Basavatarakam Hospital: బసవతారకం ఆసుపత్రి వెనుక ఒక కన్నీటి కథ ఉంది : చంద్రబాబు నాయుడు | తెలంగాణ వార్తలు | ACTPnews

Basavatarakam Hospital: బసవతారకం ఆసుపత్రి వెనుక ఒక కన్నీటి కథ ఉంది : చంద్రబాబు నాయుడు | తెలంగాణ వార్తలు


ఆస్పత్రి ప్రస్థానం వెనుక ఒక కన్నీటి కథ ఉంది!

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆస్పత్రి ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. “మా అత్తగారు బసవతారకం గారి స్ఫూర్తితోనే ఈ ఆస్పత్రి నిర్మితమైంది. గతంలో ఆమెకు క్యాన్సర్ సోకిన సమయంలో మన ప్రాంతంలో ఎక్కడా సరైన ఆస్పత్రి లేదు. ముంబై, చెన్నై వంటి నగరాలకే వెళ్లాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తూ ఆగస్టు సంక్షోభం సమయంలోనే ఆమె క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆ బాధను అనుభవించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు (ఎన్టీఆర్).. భవిష్యత్తులో పేదలకు ఇటువంటి కష్టం రాకూడదనే గొప్ప విజన్‌తో, సేవా సంకల్పంతో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు” అని చంద్రబాబు వివరించారు.

నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీగా, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు లాంటి ప్రముఖుల సహకారంతో తొలిసారిగా 100 పడకలతో ఈ ఆస్పత్రి ప్రారంభమైందని, ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో త్యాగాలు దాగి ఉన్నాయని ఆయన స్మరించుకున్నారు.

‘అన్ స్టాపబుల్’గా చైర్మన్ బాలకృష్ణ సేవలు!

వివిధ సవాళ్లను అధిగమించి ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. “బాలకృష్ణ ఈ ఆస్పత్రి కోసం ‘అన్ స్టాపబుల్’గా పనిచేస్తున్నారు. ఒకవైపు ఎవర్ గ్రీన్ హీరోగా సినిమాలు చేస్తూ, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉంటూనే.. ఎంత బిజీగా ఉన్నా తరచూ ఆస్పత్రికి వచ్చి రోగులను వ్యక్తిగతంగా పరామర్శించి వారికి స్వాంతన చేకూర్చడం అభినందనీయం. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో మేము రాజకీయాలు చూస్తుంటే, బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ వైద్య సేవలను అద్భుతంగా పర్యవేక్షిస్తున్నారు” అని కొనియాడారు.

అదేవిధంగా, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తన సతీమణి నారా భువనేశ్వరి అందిస్తున్న సేవా కార్యక్రమాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. పేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని, బాలకృష్ణ, భువనేశ్వరి చేస్తున్న సేవలు గర్వకారణమని అన్నారు.

అమరావతిలో 1000 పడకల కొత్త ఆస్పత్రి!

ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఒక కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెయ్యి (1000) పడకలతో సరికొత్త బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు బాలకృష్ణ ముందుకు రావడంపై ముఖ్యమంత్రి తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

గణాంకాల్లో ‘బసవతారకం’ సేవా ప్రస్థానం

లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ఈ ఆస్పత్రి నేడు సాధించిన విజయాలను సీఎం అభినందించారు:

మహావృక్షం: 100 పడకల నుండి నేడు 650 పడకల స్థాయికి చేరింది.

చికిత్సలు: ఏడాదికి 3 లక్షల పైచిలుకు మంది రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి.

శస్త్రచికిత్సలు: ఏడాదికి 8 వేలకు పైగా శస్త్ర చికిత్సలు జరుగుతుండగా.. సగటున రోజుకు 22 మందికి ఆపరేషన్లు చేస్తూ పేదలకు కొండంత అండగా నిలుస్తోంది.

రాష్ట్రాల సరిహద్దులు దాటి: కేవలం తెలుగు రాష్ట్రాలకే (ఏపీ, తెలంగాణ) కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుండి కూడా రోగులు ఇక్కడికి తరలివస్తున్నారు.

ప్రభుత్వం ఒక్కటే చేయలేదు.. లాభాపేక్ష లేని సంస్థలు రావాలి!

ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు మాట్లాడుతూ.. “పబ్లిక్ హెల్త్ రంగంలో ప్రభుత్వం ఒక్కటే అన్ని సేవలు అందించలేదు. బసవతారకం ఆస్పత్రి వంటి మరిన్ని లాభాపేక్ష లేని (Non-Profit) సంస్థలు ముందుకు వస్తేనే పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుతుంది. ఏపీలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మేము ప్రివెంటివ్ (నివారణ), క్యూరెటివ్ (చికిత్స), ప్రిడిక్టివ్ (ముందస్తు అంచనా) విధానాన్ని అనుసరిస్తున్నాం” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతదేశంలోనే లాభాపేక్ష లేని అతిపెద్ద క్యాన్సర్ సేవా సంస్థగా బసవతారకం ఆస్పత్రి నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *