Last Updated:
నిధి దొరుకుతుందనే అత్యాశ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఓ సాధువు చెప్పిన మాటలను నమ్మిన అత్తమామలు అల్లుడితో రూ.10 లక్షలు అప్పు చేయించి ఇంట్లో తవ్వకాలు జరిపించారు.
నిధి దొరుకుతుందనే అత్యాశ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఓ సాధువు చెప్పిన మాటలను నమ్మిన అత్తమామలు అల్లుడితో రూ.10 లక్షలు అప్పు చేయించి ఇంట్లో తవ్వకాలు జరిపించారు. చివరకు నిధి దొరకకపోవడం, అప్పుల ఒత్తిడి పెరగడంతో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతికి కారణమైన అత్త, మామతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ గ్రామంలో చోటుచేసుకుంది. మృతులు వడ్ల బాలసాయి (32), ఆయన భార్య పద్మ (26)గా గుర్తించారు. ఇద్దరూ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం పటేల్‌గూడలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ప్రస్తుతం ఐదు నెలల బాబు కూడా ఉన్నాడు.
పోలీసుల కథనం ప్రకారం, వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత దంపతులు పద్మ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఓ సాధువు తమ ఇంట్లో విలువైన నిధి ఉందని, తవ్వకాలు జరిపితే బయటపడుతుందని అత్తమామలు నమ్మినట్లు తెలుస్తోంది. నిధిని వెలికితీయడానికి రూ.10 లక్షలు అవసరమని అల్లుడు బాలసాయిని నమ్మించి డబ్బులు తెప్పించారు. అత్త శాంతమ్మ, మామ చంద్రయ్య, తోడల్లుడు వెంకటేష్ కలిసి బాలసాయిని ఒప్పించడంతో, అతడు తెలిసిన వారి వద్ద అధిక వడ్డీకి రూ.10 లక్షలు అప్పుగా తీసుకుని వారికి ఇచ్చాడు.
అనంతరం ఇంట్లో తవ్వకాలు నిర్వహించినప్పటికీ ఎలాంటి నిధి లభించలేదు. దీంతో అప్పు ఇచ్చిన వారు బాలసాయిపై డబ్బులు తిరిగి చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. మరోవైపు అత్తమామలను పలుమార్లు డబ్బుల విషయం అడిగినా వారు తిరిగి ఇవ్వకపోవడంతో బాలసాయి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పుల భారం, కుటుంబ ఒత్తిడిని తట్టుకోలేక భార్య పద్మతో కలిసి స్వగ్రామమైన జన్వాడకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై బాలసాయి సోదరుడు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బాలసాయి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా కీలకమైన సందేశం బయటపడింది. అందులో “అందరూ మమ్మల్ని క్షమించండి. నేను, నా భార్య మా అత్తమామల మాటలు నమ్మి మోసపోయాం. మా చావుకు కారణం వారే” అని రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఈ సందేశంతో పాటు సేకరించిన ఇతర ఆధారాల ఆధారంగా మోకిల పోలీసులు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేష్‌లను అరెస్టు చేశారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చగా, కోర్టు వారిని రిమాండ్‌కు తరలించింది.
నిధి పేరుతో మూఢనమ్మకాలను నమ్మడం, వాటి కోసం భారీగా అప్పులు చేయడం చివరకు ఒక యువ దంపతుల ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన మూఢనమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
Hyderabad,Telangana













