Ramayana: ట్విట్టర్‌లో లీకైన రణబీర్ కపూర్ ‘రామాయణ’ యాక్షన్ సీన్.. ఆ వీడియోలో ఏముందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రణబీర్ కపూర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’కు సంబంధించిన వీడియో లీక్ అయ్యిందన్న వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
శ్రీరాముడి అవతారంలో రణబీర్ కనిపించిన వైరల్ క్లిప్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News18
News18

2026లో విడుదలకు సిద్ధమవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ను శ్రీరాముడి పాత్రలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. ‘రామాయణ’ చిత్రానికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రణబీర్ కపూర్, శ్రీరాముడి పాత్రలో ఓ రాక్షసుడితో యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సినిమాకాన్ (CinemaCon) ఈవెంట్‌లో ప్రదర్శించిన ట్రైలర్‌కు సంబంధించిన సన్నివేశమే ఇదని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ వీడియో నిజంగానే ‘రామాయణ’ ట్రైలర్ నుంచి లీకైందా అనే చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వెంటనే అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు. లీక్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు చిత్ర నిర్మాతలు లేదా దర్శకుడు నితేష్ తివారీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామాయణ’ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడి అవతారంలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీజర్‌లోని కొన్ని విజువల్స్ ఆశించిన స్థాయిలో లేవంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విమర్శల నేపథ్యంలో చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందించారు. ప్రేక్షకుల అభిప్రాయాలను తాము ఎంతో గౌరవిస్తున్నామని, భారతీయులందరూ గర్వపడేలా ‘రామాయణ’ను తెరకెక్కించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. “మీరు ఇప్పటివరకు చూసింది కేవలం ఆరంభం మాత్రమే. మన సంస్కృతి, మన చరిత్రను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించేందుకు మా బృందం ఎంతో కష్టపడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించనుంది. కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ మందోదరి పాత్రలో, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో నటిస్తున్నారు. అరుణ్ గోవిల్, కునాల్ కపూర్, ఆదినాథ్ కోఠారే, శీబా చద్దా, ఇందిరా కృష్ణన్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా వైరల్ అయిన లీక్ వీడియోపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *