Last Updated:
Tour Package | తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హ్యాండ్లూమ్ కళలను ఒకే రోజులో చూసే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి సౌకర్యంగా, తక్కువ ఖర్చుతో తెలంగాణ ప్రత్యేకతను ఆస్వాదించాలనుకునే వారికి ఈ కొత్త టూర్ ప్యాకేజీ మంచి ఆప్షన్.
తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీటీడీసీ) తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రసిద్ధ సాంస్కృతిక ఆకర్షణలను కలిపిన కొత్త వన్-డే పిల్గ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ద్వారా పర్యాటకులకు సౌకర్యవంతమైన, అందుబాటు ధరలో, విలువైన ప్రయాణ అనుభవాన్ని అందించడంతో పాటు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక సంపద, సాంస్కృతిక వారసత్వం, హ్యాండ్లూమ్ సంప్రదాయాన్ని పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా రూపొందించిన ఈ టూర్ సర్క్యూట్ “హైదరాబాద్ – యాదగిరిగుట్ట – శిల్పారామం – కొలనుపాక జైన్ టెంపుల్ – స్వర్ణగిరి టెంపుల్ – పోచంపల్లి – హైదరాబాద్” కవర్ చేస్తుంది. ఈ ప్రయాణంలో ఒకే రోజులో ఆధ్యాత్మికత, చరిత్ర, కళలు, సంప్రదాయ చేతివృత్తుల అందాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.
టూర్ షెడ్యూల్
ఈ టూర్ ఉదయం 7:00 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం 7:15 గంటలకు బేగంపేట్‌లోని పర్యాటక భవన్, ఉదయం 7:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్వో కార్యాలయం వద్ద ప్రయాణికులు బస్సులో ఎక్కవచ్చు. ఉదయం 9:00 గంటలకు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్‌కు చేరుకుని దర్శనం చేసుకుంటారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు యాదగిరిగుట్టలోని హరిత హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు ఉంటుంది. ఉదయం 10:00 గంటలకు శిల్పారామానికి బయలుదేరి, 10:15 గంటలకు అక్కడికి చేరుకుని సందర్శిస్తారు. ఆ తర్వాత ఉదయం 10:45 గంటలకు కొలనుపాక జైన్ టెంపుల్‌కు బయలుదేరి, 11:15 గంటలకు అక్కడికి చేరుకుని ఆలయాన్ని దర్శించుకుంటారు.
మధ్యాహ్నం 1:00 గంటలకు భువనగిరిలోని వివేరా హోటల్‌కు బయలుదేరి, 1:30 గంటలకు చేరుకుని సౌత్ ఇండియన్ వెజ్ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు స్వర్ణగిరి టెంపుల్‌కు బయలుదేరి, 3:00 గంటలకు అక్కడి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు పోచంపల్లి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:45 గంటలకు భూదాన్ పోచంపల్లి వీవింగ్ సెంటర్‌కు చేరుకుని అక్కడి ప్రసిద్ధ ఇకట్ హ్యాండ్లూమ్ నేయడం సంప్రదాయాన్ని వీక్షిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు హరిత హోటల్లో హై-టీ అందిస్తారు. అనంతరం సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి, రాత్రి 7:30 గంటలకు నగరానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీలో ఏం కవర్ అవుతాయి?
పెద్దలకు ప్యాకేజీ ధర రూ.2,070 కాగా, పిల్లలకు రూ.1,770గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో ఏసీ మినీ బస్‌లో వెళ్లి రావడానికి రవాణా, బ్రేక్‌ఫాస్ట్, సౌత్ ఇండియన్ వెజ్ లంచ్, హై-టీ, అలాగే అన్ని టెంపుళ్లలో దర్శనం సౌకర్యం కల్పిస్తారు. ఆధ్యాత్మిక యాత్రికులు, కుటుంబాలు, పర్యాటకులు, వారసత్వ ప్రదేశాలపై ఆసక్తి ఉన్న వారందరూ ఈ టూర్లో పాల్గొనాలని తెలంగాణ టూరిజం ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాలు లేదా బుకింగ్‌ల కోసం సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సీఆర్వో), బషీర్‌బాగ్‌ను సంప్రదించవచ్చు. +91 98481 25720, +91 83672 85285 నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. https://tgtdc.in/package/yadagirigutta-swarnagiri లింక్‌లో పూర్తి వివరాలు ఉంటాయి.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













