PM Modi: దేశ అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రక ఘట్టం.. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్‌పై ప్రధాని మోదీ | | ACTPnews

News18


Last Updated:

భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ప్రయోగం తర్వాత స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

News18
News18

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం దేశ అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ప్రయోగాన్ని తాను ప్రత్యక్షంగా వీక్షించానని ప్రధాని మోదీ తెలిపారు. ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన స్కైరూట్ బృందానికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

ఈ అద్భుతమైన విజయం సాధించిన యువ ఇంజనీర్ల బృందానికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరగడం వల్ల అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలు వేగవంతం అవుతాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఈ అపూర్వ ప్రయోగంతో అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని ప్రధాని మోదీ స్కైరూట్ బృందాన్ని ప్రశంసించారు.

ఈ ప్రయోగం కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో దేశం మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మోదీ ఆకాంక్షించారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన స్కైరూట్ యువ బృందాన్ని త్వరలోనే తాను నేరుగా కలుస్తానని ప్రధాని ఈ సందర్భంగా వారిని ఆహ్వానించారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో ఇదొక అత్యంత ముఖ్యమైన రోజుగా ఆయన అభివర్ణించారు..

విక్రమ్-1 రాకెట్ ద్వారా పంపిన పేలోడ్లలో తన సందేశం కూడా ఉందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ ప్రయోగంతో ‘వందేమాతరం’ అనే తన సందేశం అంతరిక్షంలో సరికొత్త శిఖరాలకు చేరుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2022లో చేపట్టిన విక్రమ్-ఎస్ ప్రయోగం తర్వాత స్కైరూట్ ఏరోస్పేస్ చేపట్టిన రెండవ మిషన్ ఈ ‘మిషన్ ఆగమన్’.

ఏడు అంతస్తుల ఎత్తు ఉండే విక్రమ్-1 రాకెట్‌ను పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో సొంత ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉపయోగించి తయారు చేశారు. 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా దీనిని డిజైన్ చేశారు. ఈ మిషన్ ద్వారా గ్రహా స్పేస్, కాస్మోసెర్వ్, డిక్యూబ్డ్ వంటి సంస్థలకు చెందిన ప్రతిష్టాత్మక పేలోడ్స్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports