Last Updated:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిష ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. పేపర్ లీకేజీల వేళ, మంత్రి తన కూతుర్ని మాత్రం విదేశాల్లో చదివించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలోని లోపాలు, నీట్ పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం ఆన్లైన్ వేధింపులకు గురైంది. మంత్రి కుమార్తె నైమిష ప్రధాన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది. సీజేపీ (CJP) విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మన దేశంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, విద్యాశాఖ మంత్రిగా ఉంటూ తన సొంత కూతుర్ని మాత్రం విదేశాలకు ఎందుకు పంపారంటూ నెటిజన్లు ఆమె పోస్టులపై విపరీతంగా కామెంట్ల వర్షం కురిపించారు.
అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న టఫ్ట్స్ (Tufts) యూనివర్సిటీలో నైమిష మాస్టర్ ఆఫ్ లాస్ (LLM) కోర్సు చదువుకున్నారు. భారతీయ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న నేతలు, తమ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు ఇవ్వడానికి విదేశాలకు పంపుతున్నారని యువత మండిపడింది. వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్ శృతి మించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నైమిష తన సోషల్ మీడియా ఖాతాను నిలిపివేశారు.
నైమిష వ్యక్తిగత ఖాతాతో పాటు టఫ్ట్స్ యూనివర్సిటీ పేజీలో కూడా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నైమిషను వర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఆమె 2023లోనే ఎల్ఎల్ఎం (LLM) పూర్తి చేసి, ప్రస్తుతం యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్‌లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు.
ఈ వ్యవహారంపై కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రాజకీయ విమర్శలను మంత్రికే పరిమితం చేయాలి కానీ, నిర్ణయాధికారం లేని కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విధానపరమైన లోపాలను ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది కానీ, ఇలా వ్యక్తిగత దాడులకు దిగడం హద్దులు మీరడమే అని కొందరు మద్దతుగా నిలిచారు.
మరోవైపు, దేశంలో జరుగుతున్న విద్యార్థుల నిరసనల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందంటూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంట్లో నీట్ (NEET) తదితర విద్యా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














