Jana Nayagan: జన నాయగన్ సినిమా టిక్కెట్ల బ్లాక్ దందా.. సీఎం విజయ్‌కు అభిమానుల ఫిర్యాదు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ టికెట్ల ధరలపై తీవ్ర వివాదం చెలరేగింది. నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లు అధిక ధరలు వసూలు చేస్తుండటంతో, తక్షణమే చర్యలు తీసుకోవాలని అభిమానులు సీఎంవోకు ఫిర్యాదు చేస్తున్నారు.

News18
News18

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు థియేటర్ల యాజమాన్యాలు భారీ షాక్ ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ గరిష్ట ధరను రూ.190గా నిర్దేశించింది. కానీ కొన్ని థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా రూ.300 వరకు వసూలు చేస్తున్నాయంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఈ మేరకు నామక్కల్ జిల్లాకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అందులో అధిక ధరలపై థియేటర్ల నిర్వాహకులను అభిమానులు నిలదీయడం స్పష్టంగా కనిపిస్తోంది. రూ.300కి టికెట్లు అమ్మాలని మీకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఆ వీడియోలో థియేటర్ యాజమాన్యాన్ని అభిమానులు సూటిగా ప్రశ్నించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సీఎం విజయ్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, అభిమానుల ఆరోపణలను థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొంతమంది కేవలం బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికే పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒక్కో టికెట్‌ను బ్లాక్ మార్కెట్లో రూ.1,000 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని, అందుకే తాము ఆంక్షలు పెట్టామని థియేటర్ల నిర్వాహకులు వివరణ ఇచ్చుకున్నారు.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. నేరుగా సీఎంవో వాట్సాప్ నంబర్‌కు వీడియోలు పంపుతూ ఫిర్యాదుల వెల్లువ కురిపిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రూ.190 ధరకు మాత్రమే టికెట్లు అమ్మేలా చూడాలని విజయ్‌ను ట్యాగ్ చేస్తూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి సొంత సినిమా విషయంలోనే ఇంత అవినీతి జరిగితే, ఇతర విషయాల్లో అధికారుల నిర్లక్ష్యం ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ ముందుగా జనవరి 9, 2026న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, సాయుధ దళాలను తప్పుగా చూపేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయన్న ఫిర్యాదులతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపింది. ఎట్టకేలకు ఈ నెలలో ‘ఏ’ (Adult Only) సర్టిఫికెట్ దక్కించుకున్న ఈ చిత్రం గురువారం (జూలై 23, 2026) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *