POK: పాకిస్తానీ కశ్మీర్ కాదు, అది పీఓకే.. అమెరికా పత్రికకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! | | ACTPnews

News18


Last Updated:

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (PoK) జరుగుతున్న అల్లర్లపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంలోని హెడ్డింగ్‌పై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పాకిస్తానీ కశ్మీర్’ అనే పదం వాడటాన్ని తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

News18
News18

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (POK) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన తప్పుల తడక కథనంపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక ఎన్నికల సమయంలో పీఓకేలో చెలరేగిన అల్లర్ల గురించి రాస్తూ.. సదరు పత్రిక ‘పాకిస్తానీ కశ్మీర్’ అనే పదాన్ని హెడ్డింగ్‌లో వాడటాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. “న్యూయార్క్ టైమ్స్ హెడ్డింగ్ పూర్తిగా తప్పు, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. అసలు ప్రపంచంలో పాకిస్తానీ కశ్మీర్ అనే ప్రాంతమే లేదు, ఉన్నదల్లా పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే” అని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా బదులిచ్చింది.

జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగంగానే ఉంటాయని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా భారత భూభాగాలను ఆక్రమించుకుని, ఇప్పుడు స్వయంప్రతిపత్తి అడుగుతున్న అక్కడి అమాయక ప్రజలపై దారుణంగా హింసకు పాల్పడుతోందని ఎంబసీ ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు.

పీఓకేలో నెత్తురోడిన వీధులు

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. పీఓకేలో ద్రవ్యోల్బణం, పరిపాలనా వైఫల్యాలు, వివక్షకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు నిరసనకారులు చేపట్టిన లాంగ్ మార్చ్‌పై పాక్ భద్రతా బలగాలు విచక్షణారహితంగా మారణాయుధాలతో కాల్పులు జరిపాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ దారుణ కాండలో 30 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు.

మానవ హక్కుల ఉల్లంఘనపై ఆగ్రహం

పీఓకేలో స్థానిక ఎన్నికల పేరుతో పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలను న్యూఢిల్లీ ఖండించింది. తమ చట్టవిరుద్ధమైన ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికే ఇస్లామాబాద్ ఈ దొంగ ఎన్నికలు నిర్వహిస్తోందని మండిపడింది. అక్కడ జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచం దృష్టికి రాకుండా పాక్ ప్రభుత్వం తొక్కిపెడుతోందని భారత అధికారులు ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల బహిష్కరణ పిలుపు పాక్ పాలనపై ప్రజల్లో పెల్లుబుకుతున్న తీవ్ర వ్యతిరేకతను స్పష్టంగా సూచిస్తోంది.

ఐక్యరాజ్యసమితికి జాక్ ఫిర్యాదు

అమాయక పౌరుల హత్యలపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపించాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి జాయంట్ యాక్షన్ అవామీ కమిటీ (జాక్) విజ్ఞప్తి చేసింది. మిలిటరీ బలగాల అక్రమ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. జమ్ముకశ్మీర్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా పాక్ సైన్యం అకృత్యాలను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం రావల్కోట్, ముజఫరాబాద్ సహా ప్రధాన ప్రాంతాల్లో పాక్ బలగాలు భారీగా మోహరించి, ప్రజల కదలికలపై కఠిన ఆంక్షలు విధించాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports