Last Updated:
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, ఆయన మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జైకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతూ.. భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, ఆయన మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జైకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతూ.. భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఘట్టమనేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి నెలకొనడానికి కారణం.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడం, సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్స్, వీడియోలు చేసి తన అన్న కుమారుడికి మద్దతుగా నిలవడమే. ఈ నేపథ్యంలో నేడు (జూలై 30) థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాలో, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయింది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి డిఫరెంట్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ:
కథ అంతా తిరుపతి, బళ్లారి నేపథ్యాల్లో సాగుతుంది. తిరుపతిలో పరువు, ప్రతిష్టల కోసం ఎంతకైనా తెగించే పెద్ద మనిషి పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్). అతన్ని అంతమొందించి ఆ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని నారాయణప్ప (వడ్లమాని శ్రీనివాస్) ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలో తిరుపతికి వచ్చిన శ్రీను (జై కృష్ణ) పెద్దిరెడ్డి కూతురు మంగ (రషా తడాని)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే, అప్పటికే ఆమెకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం అవుతుంది. అయినా సరే ఆమె ప్రేమను గెలుచుకోవాలని శ్రీను చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో పెద్దిరెడ్డి సోదరుడిపై జరిగిన దాడిని శ్రీను అడ్డుకోవడం లాంటి పరిణామాలతో కథ మలుపు తిరుగుతుంది. పెద్దిరెడ్డి చెల్లి వరలక్ష్మి (వాసుకి) ఎంట్రీ ఇచ్చి శ్రీనును చూసి ఆశ్చర్యపోవడం, ఆ తర్వాత బళ్లారిని శాసించే వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కి హీరోకి ఉన్న సంబంధం ఏమిటనేది మిగతా కథ.
విశ్లేషణ, నటీనటుల పనితీరు:
ఫస్టాఫ్ ఒక సాధారణ, రొటీన్ ప్రేమకథలా అనిపించినప్పటికీ, చివర్లో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. దర్శకుడు అజయ్ భూపతి మార్క్ ఎలివేషన్స్, ఎమోషన్స్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. రొటీన్ ప్రేమకథకు కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో అదరగొట్టారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకే ప్రధాన బలం. తొలి సినిమానే అయినా జైకృష్ణ డ్యాన్సులు, ఫైట్స్ లో మెప్పించాడు, నటన పరంగా ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. రషా తడాని పర్వాలేదనిపించింది. కిక్ శ్యామ్ విభిన్నమైన పాత్రలో, నరేష్ తనదైన కామెడీతో, వాసుకి, బ్రహ్మాజీ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది.
మొత్తం మీద.. ‘శ్రీనివాస మంగాపురం’ ఒక రొటీన్ కథే అయినప్పటికీ, ఘట్టమనేని వారసుడిని లాంచ్ చేయడానికి తగ్గట్టుగా కమర్షియల్ హంగులతో, పవర్ ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ తో దర్శకుడు తెరకెక్కించాడు. మాస్, కమర్షియల్ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 30, 2026 12:36 PM IST














