AI: మానవ మేదస్సుకు AI ప్రత్యామ్నయమా… అక్కున చేర్చుకోవాలా… ఆమడ దూరంలో ఉండాలా…? | | ACTPnews

AI: మానవ మేదస్సుకు AI ప్రత్యామ్నయమా... అక్కున చేర్చుకోవాలా... ఆమడ దూరంలో ఉండాలా...? |


హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. భవిష్యత్తులో AI మనుషులను పూర్తిగా భర్తీ చేస్తుందా? ఉద్యోగాలు ఉంటాయా? విద్యార్థులు ఏ కోర్సులు చదవాలి? తదిరత సందేహాలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా పెగా ఏఐ (PEGA AI) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్ ఆఫ్ మార్కెటింగ్ డాన్ షూర్మన్, పెగా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ విశ్వేశ్వరయ్య న్యూస్18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హైదరాబాద్ లో సోమనారం జరిగిన పెగా ఇన్నోనేట్ 2026 (PegaInnovate 2026) వార్షిక కార్యక్రమలో వీరిద్దరు పాల్గొన్న సందర్భంగా వీరిద్దరు పాల్గొన్నారు.

AI మనిషి కంటే సమర్థవంతంగా పన చేస్తుందా?

AI కోడింగ్ చేయడం, డేటాను విశ్లేషించడం, డాక్యుమెంట్లు తయారు చేయడం వంటి పనుల్లో ఎంతో ముందుకు వెళ్లిందని డాన్ షూర్మన్ చెప్పారు. అయితే, మనిషి ఆలోచనా శక్తి (Human Judgment), సృజనాత్మకత (Creativity), సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని AI భర్తీ చేయలేదన్నారు. “AI పనులను వేగంగా చేయగలదు. కానీ ఒక ఆలోచన నిజంగా వినియోగదారుడికి ఉపయోగపడుతుందా? విలువను సృష్టిస్తుందా? అనే నిర్ణయం మాత్రం మనిషే తీసుకోగలడు. AI అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ ఆలోచనలకు, నిర్ణయాలకు మరింత విలువ పెరుగుతుంది” అని ఆయన చెప్పారు.

AI ఉద్యోగాలను ఊడగొడుతుందా?

AI కారణంగా లక్షలాది ఉద్యోగాలు పోతాయనే భయంపై ఇద్దరు నిపుణులు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. మనిషికి పని అనేది కేవలం సంపాదన కోసం మాత్రమే కాదని, జీవితానికి అర్థం, సంతృప్తి, గుర్తింపును కూడా ఇస్తుందని షూర్మన్ అన్నారు. “AI పునరావృతమయ్యే సాధారణ పనులను ఆటోమేట్ చేస్తుంది. దీంతో మనుషులు మరింత సృజనాత్మకమైన, వ్యూహాత్మకమైన పనులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది” అని తెలిపారు.

దీపక్ విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ, ప్రతి సాంకేతిక విప్లవం పాత ఉద్యోగాల రూపాన్ని మార్చిందేగానీ, ఉద్యోగాలనే పూర్తిగా తొలగించలేదన్నారు. “50 సంవత్సరాల క్రితం నేటి అనేక ఉద్యోగాలు లేవు. అలాగే మరో 50 సంవత్సరాల తర్వాత వచ్చే ఉద్యోగాలు ఇప్పుడు మన ఊహలో కూడా లేవు” అని వ్యాఖ్యానించారు.

AIకి కూడా పరిమితులు ఉన్నాయా?

ప్రస్తుతం పెద్ద భాషా నమూనాల (Large Language Models) అభివృద్ధి వేగంగా సాగుతున్నప్పటికీ, ఒక దశ తర్వాత అది సహజంగానే స్థిరపడుతుందని డాన్ షూర్మన్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత కంటే పెద్ద సవాలు AIని సంస్థల వ్యాపార ప్రక్రియల్లో సమర్థవంతంగా అనుసంధానం చేయడం, నిబంధనలను పాటించడం, ఉద్యోగులను కొత్త విధానాలకు సిద్ధం చేయడమేనని చెప్పారు. “ప్రస్తుతం AI చాలా వ్యాపార అవసరాలకు సరిపడే స్థాయికి వచ్చింది. ఇప్పుడు అసలు సవాలు టెక్నాలజీ కాదు… దాన్ని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడమే” అని పేర్కొన్నారు.

భారత్ ప్రపంచ AI హబ్‌గా మారుతుందా?

భారత్ ప్రపంచ AI రంగంలో కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ఇద్దరు నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అనేక బహుళజాతి సంస్థల టెక్నాలజీ నిర్ణయాలు ఇప్పుడు భారతదేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCCs) నుంచే తీసుకుంటున్నారని షూర్మన్ తెలిపారు. దీంతో భారత్ కేవలం సాఫ్ట్‌వేర్ టాలెంట్‌కే కాకుండా, ప్రపంచ టెక్నాలజీ నిర్ణయాలకు కూడా కేంద్రంగా మారుతోందన్నారు. పెగా కూడా భారత్‌లో ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ను విస్తరించడంతో పాటు, భారతీయ కస్టమర్లతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, టెలికాం, ప్రభుత్వ సంస్థలు, తయారీ రంగం, ఆరోగ్య రంగాల్లో పెగా సేవలందిస్తోందని చెప్పారు. AI విప్లవంలో భారత్‌కు రెండు ప్రధాన బలాలు ఉన్నాయని దీపక్ విశ్వేశ్వరయ్య అన్నారు. “మొదటిది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ టాలెంట్ పూల్. రెండోది, అన్ని రంగాల్లో AIను వినియోగించి ఉత్పాదకత, సామర్థ్యం, కస్టమర్ సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి భవిష్యత్ AI నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉంది.” దీపక్ విశ్వేశ్వరయ్య అన్నారు.

AI ఖర్చులు కూడా పెరుగుతున్నాయా?

AIను అమలు చేయడం మానవ వనరుల కంటే ఖరీదుగా మారుతుందనే ప్రశ్నకు దీపక్ విశ్వేశ్వరయ్య స్పందించారు. పెద్ద భాషా నమూనాల ధరల్లో మార్పులు రావడంతో కంపెనీలు ఇప్పుడు AIపై ఎంత ఖర్చు చేస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. పెగా మాత్రం AI వినియోగం ఆధారంగా కాకుండా, వ్యాపార ఫలితాల ఆధారంగా ధరలను నిర్ణయించే విధానాన్ని అనుసరిస్తోందన్నారు.

షూర్మన్ మాట్లాడుతూ, “AIని ఎంత వాడామనేది కాదు… దాని వల్ల వ్యాపారానికి ఎంత విలువ వచ్చింది? పెట్టుబడిపై ఎంత లాభం వచ్చింది? అనే అంశాలపైనే ఇప్పుడు కంపెనీలు దృష్టి పెడుతున్నాయి” అని చెప్పారు.

విద్యార్థులు ఏం నేర్చుకోవాలి?

AI కారణంగా విద్యార్థుల్లో భవిష్యత్తు ఉద్యోగాలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దీపక్ విశ్వేశ్వరయ్య కీలక సూచనలు చేశారు. గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ వంటి ప్రాథమిక అంశాలపై పట్టు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

అంతేకాకుండా… కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, నిరంతరం నైపుణ్యాలను పెంచుకోవడం, మార్పులకు అనుగుణంగా మారడం, కొత్త ఆలోచనలను ప్రశ్నించే ధైర్యం, వంటి లక్షణాలు కూడా AI యుగంలో అత్యంత కీలకమని చెప్పారు.

షూర్మన్ మాట్లాడుతూ… టెక్నాలజీతో పాటు ఫైనాన్స్, ఆరోగ్యం, న్యాయం, తయారీ వంటి రంగాలపై అవగాహన కలిగిన వారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని చెప్పారు.

AI ప్రభావం లేని ఉద్యోగాల కోసం వెతకడం కంటే, AIని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఇద్దరు నిపుణలు అభిప్రాయపడ్డారు. “AI నుంచి పారిపోవద్దు. AIని అర్థం చేసుకోండి. మార్పులకు అనుగుణంగా మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగండి. భవిష్యత్తులో విజయవంతమయ్యేది AIని దూరం పెట్టిన వారు కాదు… AIతో కలిసి పనిచేయడం నేర్చుకున్న వారే” అని వారు స్పష్టం చేశారు.

పెగా AI అనేది ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సంస్థ పెగా సిస్టమ్స్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు (AI) ప్లాట్‌ఫాం. వర్క్‌ఫ్లో ఆటోమేషన్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, డెసిషన్ ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ, AIను ఆటోమేషన్‌తో మిళితం చేసి సంస్థలు వేగంగా నిర్ణయాలు తీసుకునేలా, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా, వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా పరిష్కారాలను అందిస్తోంది.

పెగా AI, సంస్థ రూపొందించిన పెగా ఇన్ఫినిటీ ప్లాట్‌ఫాం అంతర్భాగంగా పనిచేస్తుంది. దీని ద్వారా సంస్థలు క్లిష్టమైన వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేయడంతో పాటు, కస్టమర్ల అవసరాలను ముందుగానే అంచనా వేసి, వారికి వ్యక్తిగతీకరించిన (Personalized) సేవలను రియల్ టైమ్‌లో అందిస్తోంది.

భారత్ పెగాకు వ్యూహాత్మకంగా కీలక మార్కెట్. దేశం ఒకవైపు ఇంజినీరింగ్, ఉత్పత్తి అభివృద్ధి కేంద్రంగా ఉంటూనే వేగంగా విస్తరిస్తున్న వినియోగదారుల మార్కెట్‌గా కూడా మారుతోంది. హైదరాబాద్, బెంగళూరు సహా పలు టెక్నాలజీ కేంద్రాల్లో పెగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ స్థాయి ఉత్పత్తుల అభివృద్ధి, AI ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌ల అభివృద్ధికి భారత్‌ను కీలక కేంద్రంగా ఉపయోగిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed