Last Updated:
అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక సైనిక విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన విమానం సైనిక సరఫరాలను రవాణా చేయడానికి ఉపయోగించే ‘AN-32 కార్గో ప్లేన్’ అని గుర్తించారు.
Aircraft Crash: భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఒక AN-32 రవాణా విమానం (Transport Aircraft) శనివారం ఘోర ప్రమాదానికి గురైంది. అస్సాంలోని జోర్హాట్‌లో గల వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ‘రౌరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్’ పరిధిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ విమానం రన్‌వే సమీపంలో కుప్పకూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి ‘కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ’ (Court of Inquiry) కి ఆదేశించినట్లు భారత వైమానిక దళం (IAF) అధికారికంగా ప్రకటించింది.
“అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక సైనిక విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన విమానం సైనిక సరఫరాలను రవాణా చేయడానికి ఉపయోగించే ‘AN-32 కార్గో ప్లేన్’ అని గుర్తించాం. ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో విమాన పైలట్ ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నాం. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, దర్యాప్తు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.” అని ఐఏఎఫ్ పేర్కొంది.
విమానంలో ఉన్న ఇతర సిబ్బంది వివరాలు మరియు వారి పరిస్థితిపై తక్షణమే స్పష్టమైన సమాచారం లభించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదం జరిగిన రౌరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈశాన్య భారతదేశంలోనే (Northeast) అత్యంత కీలకమైన వైమానిక స్థావరాలలో ఒకటి. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల పరిధిలో జరిగే అన్ని రకాల వైమానిక కార్యకలాపాలు, రవాణా పర్యవేక్షణలో ఈ బేస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
असम के जोरहाट में एयरफोर्स का कार्गो प्लेन AN-32 हादसे का शिकार हो गया है. एयरबेस के अंदर लैंडिंग के दौरान विमान में आग लग गई. फिलहाल #IAF #Jorhat #Assam pic.twitter.com/MLSKRJrmqi
— Kishor Joshi (@KishorJoshi02) June 13, 2026
ప్రస్తుత ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, రికార్డుల ప్రకారం.. 1986 నుండి ఇప్పటివరకు భారతదేశంలో సుమారు 22 సార్లు AN-32 విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. దీనికంటే ముందు అత్యంత సమీప కాలంలో, అంటే గతేడాది 2025 లో కూడా ఒక AN-32 విమానం కూలిపోయింది. ఇన్ని ప్రమాదాల చరిత్ర ఉన్నప్పటికీ.. ఇప్పటికీ భారత వైమానిక దళంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా విమానాలలో AN-32 ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా రక్షణ లాజిస్టిక్స్, కార్గో సరఫరా మిషన్లలో ఇది కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.
జోర్హాట్ ఎయిర్‌బేస్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని బొకాజన్ సబ్ డివిజన్ పరిధిలో గల ‘ఇంగ్లాంగ్ ఎకోపి హిల్స్’ పై.. కొద్ది నెలల క్రితమే ఐఏఎఫ్‌కు చెందిన ‘సుఖోయ్-30 ఎంకేఐ’ (Sukhoi-30MKI) ఫైటర్ జెట్ సాధారణ శిక్షణ సమయంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం మరిచిపోకముందే ఇప్పుడు జోర్హాట్ ఎయిర్ బేస్‌లోనే మరో ఘోర ప్రమాదం జరగడం వైమానిక దళంలో ఆందోళన కలిగిస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 13, 2026 12:32 PM IST













