Last Updated:
పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లులో పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించారు.
దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల చట్టానికి మరింత పదును పెడుతూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు 2026కు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ కొత్త బిల్లులో నిందితులకు మరింత కఠినమైన శిక్షలు, కేసుల సత్వర విచారణ, పేపర్ లీక్ కేసుల కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలను పొందుపరిచారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దీని ప్రకారం, సోమవారం ప్రారంభమయ్యే లోక్సభ సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ పరీక్షల పట్ల విద్యార్థుల్లో మళ్లీ నమ్మకం కలిగించేందుకు కేంద్రం ఈ కీలక అడుగు వేసింది.
ప్రస్తుతం ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 నిబంధనలకు ఈ కొత్త బిల్లు ద్వారా మరింత కఠినమైన సవరణలు చేశారు. ఈ చట్టం కింద నేరాలకు పాల్పడే వారికి కనీస శిక్షను మూడు ఏళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. గరిష్ట జైలు శిక్షను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచడంతో పాటు, గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు. పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే సర్వీస్ ప్రొవైడర్లు కూడా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
అలాంటి సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా వారిపై ఉన్న నిషేధాన్ని నాలుగు ఏళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పెంచారు. ఇందులో పాలుపంచుకునే సంస్థ డైరెక్టర్లు, సీనియర్ అధికారులకు కనీసం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా ఉంటుంది.
ఈ కేసుల విచారణ వేగవంతం చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఏర్పాటు చేసే అధికారాన్ని ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తోంది. ఈ చట్టం కింద నమోదైన కేసుల విచారణను రెండు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం ఈ కేసుల విచారణ కోసమే ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. ఈ కోర్టులు ప్రతిరోజూ విచారణ జరిపి, ఛార్జిషీట్ దాఖలైన మూడు నెలల్లోనే తీర్పును వెలువరించాలి. ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసులను కూడా ఈ కోర్టులకు బదిలీ చేస్తారు. బదిలీ అయిన దశ నుంచే ఆ కేసుల విచారణ కొనసాగుతుంది.
ఈ చట్టం కింద విచారణ జరిపేందుకు ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక అప్పీలేట్ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీళ్లను సంబంధిత హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందుకు తీసుకువెళ్లాలి. ఇలాంటి అప్పీళ్లను కూడా వీలైనంత వరకు మూడు నెలల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. కాలబద్ధమైన విచారణ, సత్వర తీర్పులు ఇవ్వడం ద్వారా పబ్లిక్ పరీక్షల పారదర్శకత, విశ్వసనీయతను కాపాడటమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశమని బిల్లు లక్ష్యాల్లో పొందుపరిచారు.
ఈ చట్టాన్ని చట్టసభల్లో ఆమోదించుకునేంత సంఖ్యాబలం ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, రాజకీయంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ అంశంపై సభలో ఎలాంటి చర్చలో పాల్గొనేది లేదని ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి.
ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాతే బిల్లుపై చర్చిస్తామని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈ రాజకీయ ప్రతిష్టంభన నడుమ సవరణ బిల్లుకు ఉభయ సభల్లో ఎంతవరకు మద్దతు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














