Last Updated:
భర్త సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ బీమా (ఇన్సూరెన్స్) పాలసీ ఉన్నట్లు సుమకు, ఆమె ప్రియుడికి తెలిసింది. ఎలాగైనా సందీప్‌ను అడ్డుతొలగించుకుంటే.. ఒకరికొకరం తోడుగా ఉండటమే కాకుండా, రూ. 2 కోట్ల భారీ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని వీరిద్దరూ పథకం వేశారు.
Belagavi: సమాజంలో డబ్బుపై వ్యామోహం, అక్రమ సంబంధాలు ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఏడడుగుల బంధాన్ని మరిచి, కోట్లాది రూపాయల బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో ఒక భార్య తన ప్రియుడితో కలిసి కన్న భర్తనే కడతేర్చిన ఘోర ఉదంతం బెళగావి జిల్లాలో వెలుగుచూసింది. పైగా ఇది సహజ మరణంగా లేదా ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించి చట్టం కళ్లు కప్పేందుకు ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను సైతం లంచాలతో లొంగదీసుకున్నారు. చివరకు నిందితుల పాపం పండి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఈనాడు కథనం ప్రకారం.. బెళగావి జిల్లాకు చెందిన సందీప్ కలగౌడ మంజరగి (46) ఒక మాజీ సైనికుడు. అతని భార్య సుమ. అయితే, సుమకు పుండలీక డౌంబర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే భర్త సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ బీమా (ఇన్సూరెన్స్) పాలసీ ఉన్నట్లు సుమకు, ఆమె ప్రియుడికి తెలిసింది. ఎలాగైనా సందీప్‌ను అడ్డుతొలగించుకుంటే.. ఒకరికొకరం తోడుగా ఉండటమే కాకుండా, రూ. 2 కోట్ల భారీ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని వీరిద్దరూ పథకం వేశారు.
పథకం ప్రకారం.. మార్చి 13న సందీప్ ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయనను హుక్కేరిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. నిజానికి ఆ ప్రమాదంలో ఆయనకు పెద్దగా ప్రాణాపాయం కలగలేదు. కానీ, ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న భార్య సుమ, ఆమె ప్రియుడు పుండలీక ఘోరానికి ఒడిగట్టారు. మార్చి 15న ఆసుపత్రిలో సందీప్ బెడ్‌పై ఉన్న సమయంలో, ఎవరికీ అనుమానం రాకుండా ఆయనకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్లో అత్యంత ఘోరమైన విషాన్ని కలిపారు. విషం శరీరంలోకి పాకడంతో సందీప్ మంజరగి ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచారు.
రోడ్డు ప్రమాదంలో తగిలిన గాయాల వల్లే చికిత్స పొందుతూ సందీప్ మరణించాడని భార్య సుమ నాటకమాడింది. బంధువులను, గ్రామస్తులను నమ్మించి హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు. ఆ తర్వాత బీమా సొమ్ము క్లెయిమ్ చేసుకోవడం కోసం నకిలీ వైద్య పరీక్షల నివేదికలను సృష్టించడం ప్రారంభించారు. ఇందుకోసం బెళగావి కమిషనర్ కార్యాలయం ఎఫ్‌డీఏ అశోక గుజనాళ, ఫోరెన్సిక్ ప్రయోగశాల గుమస్తా అప్పాసాహెబ నాయక, ల్యాబ్ అసిస్టెంట్ అడవి స్వామిమఠ, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పీఎన్ నాగరాజ్, మరియు ఒక ఆర్ఎంపీ వైద్యుడు బసవరాజ భస్మెలకు భారీగా లంచాలు ఇచ్చి తమ నేరం బయటపడకుండా మేనేజ్ చేశారు.
సందీప్ మరణం వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానంతో అతని సోదరుడు స్థానిక యమకనమరడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. మొదట భార్య సుమను, ఆమె ప్రియుడు పుండలీకను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. సెలైన్‌లో విషం కలిపి చంపిన వైనాన్ని వివరిస్తూ, తమకు సహకరించిన మిగతా నిందితుల పేర్లను వెల్లడించారు.
బెళగావి ఎస్పీ భీమా శంకర గుళేద్ మీడియాతో మాట్లాడుతూ.. రూ. 2 కోట్ల బీమా సొమ్ము కోసం జరిగిన ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితులైన సుమ, పుండలీకతో పాటు నకిలీ పత్రాలు సృష్టించిన ప్రభుత్వ ల్యాబ్ అసిస్టెంట్, ఫోరెన్సిక్ క్లర్క్, ఆర్ఎంపీ డాక్టర్ మరియు పుండలీక స్నేహితులు నేలార, రాహుల్ జోగి సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. నిందితులందరిపై హత్య, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













