Social Media Ban: బ్రిటన్‌లో సంచలన నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! | | ACTPnews

బ్రిటన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్


Last Updated:

బ్రిటన్ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక, కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు.

బ్రిటన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
బ్రిటన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్

Social Media Ban: చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు, వారిని ఆన్‌లైన్ వ్యసనాల నుండి దూరం చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక, కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు. డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిషేధం యొక్క ఆవశ్యకతను వివరించారు. “సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. అవి వారిని వ్యసనపరులుగా మార్చేలా డిజైన్ చేయబడ్డాయి. ప్రమాదకరమైన కంటెంట్‌కు వారు బలైపోతున్నారు” అని స్టార్మర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పూర్తి నిషేధం వల్ల పిల్లలు మరింత సురక్షితంగా, సంతోషంగా ఎదుగుతారని, వారికి బాల్యాన్ని తిరిగి ఇచ్చినట్లవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఏ యాప్‌లపై నిషేధం?

ప్రభుత్వ నివేదిక ప్రకారం.. యువత ఎక్కువగా ఉపయోగించే దాదాపు 10 ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లపై ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఇందులో టిక్‌టాక్ (TikTok), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (YouTube), స్నాప్‌చాట్ (Snapchat), ఫేస్‌బుక్ (Facebook), ఎక్స్ (X – పాత ట్విట్టర్), థ్రెడ్స్, ట్విచ్, కిక్, రెడ్డిట్ వంటి యాప్‌లు ఉన్నాయి. అయితే, పరస్పర సమాచార మార్పిడికి ఉపయోగపడే వాట్సాప్ (WhatsApp), సిగ్నల్ (Signal) వంటి మెసేజింగ్ యాప్‌లకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు.

కేవలం సోషల్ మీడియానే కాకుండా, గేమింగ్, లైవ్‌స్ట్రీమింగ్ యాప్‌ల ద్వారా పిల్లలు అపరిచిత వ్యక్తులతో (Strangers) మాట్లాడటాన్ని కూడా నియంత్రించనున్నారు. “నిజ జీవితంలో మీ పిల్లలను ఎవరైనా తెలియని అపరిచిత వ్యక్తితో తిరగనిస్తారా? ఇవ్వరు కదా.. మరి ఆన్‌లైన్ ప్రపంచంలో దానికి ఎలా అనుమతిస్తాం?” అని ప్రధాని ప్రశ్నించారు.

ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది?

ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన ముసాయిదాను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆమోదించి, వచ్చే ఏడాది (2027) వసంత కాలం (Spring) నాటికి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా, 18 ఏళ్లలోపు పిల్లల కోసం రాత్రి పూట ‘కర్ఫ్యూ’లు (సోషల్ మీడియా వాడకుండా సమయ పరిమితులు విధించడం), స్క్రీన్ ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్‌కు బ్రేకులు వేయడం వంటి మరికొన్ని కఠిన చర్యలను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిని అమలు చేయడానికి ప్రత్యేక ‘ఏజ్ వెరిఫికేషన్’ సాంకేతికతలను, డిజిటల్ ఐడీ చెక్‌లను ఉపయోగించనున్నారు.

మిశ్రమ స్పందన

ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో 90 శాతానికి పైగా తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి మద్దతు పలికారు. పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఇది మంచి నిర్ణయమని పలువురు కొనియాడుతున్నారు. అయితే, టెక్ కంపెనీలైన మెటా, యూట్యూబ్‌తో పాటు కొంతమంది నిపుణులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటి కఠినమైన నిషేధాల వల్ల పిల్లలు మరింత ప్రమాదకరమైన, నియంత్రణ లేని ‘డార్క్ వెబ్’ (Dark Web) వంటి ఆన్‌లైన్ మార్గాల వైపు మళ్లే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది ఆస్ట్రేలియా దేశం కూడా 16 ఏళ్లలోపు పిల్లలపై ఇటువంటి నిషేధాన్ని విధించింది. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే బాటలో పయనిస్తూ మరింత కఠినమైన చట్టాలను తీసుకువస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *