గుజరాత్ రాష్ట్రాన్ని చండీపూర వైరస్ కేసులు భయపెడుతున్నాయి. మొత్తం 184 అనుమానిత కేసుల్లో 35 మందికి చండీపుర వైరస్ ఉన్నట్లుగా వైద్యాశాఖ తేల్చింది. ఇక ఈ వైరస్ బారినపడి 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 నమూనాల పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. పాజిటివ్‌గా తేలిన ఏడుగురు రోగులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సివిల్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురు పేషెంట్స్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
#WATCH | Gandhinagar | On the cases of Chandipura virus, Gujarat Health Minister Praful Pansheriya says, “In Gujarat, we conducted blood tests on 184 patients, including suspected cases. Of these, 35 tested positive for Chandipura virus. Currently, 7 patients are being treated in… pic.twitter.com/rr1XzteUc4
— ANI (@ANI) August 4, 2026
గత రెండు నెల పదిహేను రోజులుగా గుజరాత్లో ‘చండిపుర’ వైరస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరంగా కృషి చేస్తోంది. జూన్ 30 నుండి జూలై 22, 2026, సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 89 చండీపుర వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 కేసులు పాజిటివ్‌గా తేలాయి. కాని ఆగస్ట్ 2వ తేది 2026 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 35కి చేరుకోగా 22 మంది మరణించారు. ఇక అనుమానిత కేసుల సంఖ్య 184గా ఉంది. మరణించిన వారిలో ముగ్గురు రాజస్థాన్‌కు చెందిన వారున్నారు. ఈ వైరస్ పిల్లల మెదడుపై దాడి చేస్తుందని వైద్యశాఖ నిర్ధారించింది. దీనివల్ల ఈ వ్యాధిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సరైన సమయంలో చికిత్స అందిస్తే ఆ బిడ్డను కాపాడుకోవచ్చు. జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా 25కి పైగా అనుమానిత కేసులు పంచమహల్ జిల్లాలో నమోదయ్యాయి. అలాగే సబర్కాంతలో ఎనిమిది, మెహసానాలో ఐదు అనుమానిత కేసులు నమోదయ్యాయి.
ఈ వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు 1965లో మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో నమోదైంది. అందుకే దీనికి చండీపుర’ అని పేరు పెట్టారు. అప్పట్లో ఆ రోగిలో డెంగ్యూను పోలిన లక్షణాలు కనిపించాయి. 2003 వరకు దీనిని ప్రజలకు పెద్దగా ముప్పు కలిగించని ఒక సాధారణ వైరస్‌గానే భావించేవారు. అయితే2003లో ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో చండీపుర వైరస్ కారణంగానే 183 మంది పిల్లలు మరణించారు. 2004లో గుజరాత్లో ఈ వైరస్ కారణంగా 18 మంది పిల్లలు మరణించారు. ఆ తర్వాత 2005లో పశ్చిమ బెంగాల్లో ఈ వ్యాధి వల్ల 49 మంది పిల్లలు చనిపోయారు. 2024లో గుజరాత్లో ఈ వ్యాధి మళ్లీ ప్రబలి, 82 మంది పిల్లల ప్రాణాలను బలిగొంది. 1965 నుండి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా , బీహార్ రాష్ట్రాల్లో ఈ వ్యాధి కనిపించింది.
చండీపుర వైరస్ ప్రధానంగా దోమలు , ఇసుక ఈగల (sandflies) ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను వ్యాప్తి చేసే ఇసుక ఈగ సాధారణ గృహపు ఈగ పరిమాణంలో నాలుగవ వంతు మాత్రమే ఉంటుంది. ఇది ప్రధానంగా మట్టి ఇళ్ల గోడల పగుళ్లలో నివసిస్తూ పిల్లలను కుడుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా 0 నుండి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలలో కనిపిస్తుంది.
చండీపుర వైరస్‌ను వ్యాప్తి చేసే ఇసుక ఈగలు ఎక్కడ నివసిస్తాయి..?
ఇసుక ఈగలు ఇళ్ల లోపల తేమతో కూడిన వాతావరణంలో కనిపిస్తాయి.
మట్టి ఉపరితలాలపై లేదా మట్టి గోడలపై నివసిస్తాయి.
ఇసుక ఈగలు (Sandflies) తమ సంతానోత్పత్తి కోసం గుడ్లు పెడతాయి.
దోమల మాదిరిగానే ఇవి మొదట లార్వాలుగా మారి ఆ తర్వాత పూర్తి స్థాయి ఈగలుగా అభివృద్ధి చెందుతాయి.
ఇసుక ఈగలు కొన్నిసార్లు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి.
ఇవి సాధారణ ఈగ పరిమాణంలో నాలుగో వంతు మాత్రమే ఉంటాయి.
ఇసుక ఈగలు తమ గుడ్లను ఇంటి లోపల , బయట ఉన్న మట్టి గోడల పగుళ్లలోనూ, అలాగే తేమతో కూడిన ప్రదేశాలలోనూ పెడతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మట్టి ఇళ్లలో, ఇవి గోడల పగుళ్లు , చిన్న రంధ్రాలలో నివసిస్తాయి.
చండీపుర కాలా-అజార్ (Kala-azar) వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఇసుక ఈగలే కారణం. చండీపుర వ్యాధి సాధారణంగా 0 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో కనిపిస్తుంది (దీనికి కారణం వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే).
1.పిల్లవాడికి తీవ్రమైన జ్వరం
2.విరేచనాలు
3.వాంతులు
4.కడుపులో నొప్పి లేదా తిమ్మిర్లు
5.పాక్షిక స్పృహ లేదా స్పృహ కోల్పోవడం.
1.ఇసుక ఈగలు లోపలికి రాకుండా ఉండేందుకు, ఇంటి లోపలి , బయటి గోడలకు ఉన్న రంధ్రాలు, పగుళ్లను మూసివేయండి.
2.ఇంటిలోకి గాలి, సూర్యరశ్మి వీలైనంత ఎక్కువగా వచ్చేలా చూసుకోండి.
3. 14 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలు పురుగుమందు పూసిన దోమతెరల కింద నిద్రపోయేలా అలవాటు చేయండి.
4.వీలైనంత వరకు, పిల్లలను బయట (ఉదాహరణకు ఇంటి ఆవరణలో) బహిరంగ ప్రదేశంలో నిద్రపోనివ్వకండి.
చండీపుర వైరస్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం అక్కడ మట్టి ఇళ్లు ఎక్కువగా ఉండటమే. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో ప్రబలుతుంది. ఎందుకంటే ఆ సమయంలో ఇసుక ఈగలు (sandflies) అధిక చురుకుదనంతో ఉంటాయి. అయితే ఈ వ్యాధి కేవలం గ్రామాల్లోని పిల్లలకే పరిమితం కాదు 2024లో అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్ నగరాల్లో కూడా చండీపుర కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది (2026) అహ్మదాబాద్‌లో చండీపుర వ్యాధి కారణంగా ఒక మరణం సంభవించినట్లు నివేదిక అందింది.
ఒక నివేదిక ప్రకారం 2024 జూలై 31 నాటికి గుజరాత్లో 148 చండీపురా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 140 గుజరాత్ నుండి, 4 మధ్యప్రదేశ్ నుండి, 3 రాజస్థాన్ నుండి 1 మహారాష్ట్ర నుండి ఉన్నాయి. మొత్తం 59 మంది రోగులు మరణించగా వారిలో 51 మంది చండీపురా కారణంగానే మరణించినట్లు నిర్ధారించబడింది. ఇది ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైనదో తెలియజేస్తుంది.వెంటనే చికిత్స అందకపోతే మరణం సంభవించవచ్చు. వైద్యుల ప్రకారం ఈ వైరస్ పిల్లల మెదడుపై దాడి చేస్తుంది. ఒకవేళ వైరస్ మెదడుకు చేరకపోతే ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. అయితే వైరస్ మెదడులో 60–70 శాతం వరకు వ్యాపిస్తే ఆ బిడ్డను కాపాడటం కష్టమవుతుంది.













