CIA: నకిలీ సర్టిఫికెట్లతో 20 ఏళ్లు ఉద్యోగం..300కు పైగా బంగారు బిస్కెట్లు, కోట్ల నగదు.. నిఘా సంస్థ సీఐఏకే మాజీ ఉద్యోగి టోకరా! | | ACTPnews

డేవిడ్ రష్


Last Updated:

తన విద్యా అర్హతలు, సైనిక అనుభవం గురించి అబద్ధాలు చెప్పి దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడనే ఆరోపణలపై ఒక మాజీ సీఐఏ అధికారిపై ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది.ఇంట్లో సోదా చేయగా అధికారులు నివ్వెరపోయే విలువైన వస్తువులు లభించాయి.

డేవిడ్ రష్
డేవిడ్ రష్

CIA: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గూఢచార సంస్థ ‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ’ (CIA)లో ఒక ఉన్నతాధికారి స్థాయి వ్యక్తి సాగించిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తన విద్యా అర్హతలు, సైనిక అనుభవం గురించి అబద్ధాలు చెప్పి దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడనే ఆరోపణలపై ఒక మాజీ సీఐఏ అధికారిపై ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎఫ్‌బీఐ (FBI) అధికారులు నిందితుడి ఇంట్లో సోదాలు చేయగా, ఏకంగా 40 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 330 కోట్లకు పైగా) విలువైన 303 బంగారు బిస్కెట్లు (Gold bars) లభ్యమవ్వడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే

ఏబీసీ న్యూస్ కథనం ప్రకారం.. వర్జీనియాకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి గతంలో అమెరికా ప్రభుత్వ సంస్థలో అత్యంత కీలకమైన ‘సీనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్’ (SES) స్థాయిలో పనిచేశాడు. అత్యున్నత రహస్యాలను తెలుసుకునేందుకు వీలుండే ‘టాప్ సీక్రెట్ క్లియరెన్స్’ కూడా ఇతనికి ఉంది. అయితే ఇతడు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై వర్జీనియా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫెడరల్ ఫిర్యాదు నమోదైంది.

అబద్ధపు సర్టిఫికెట్లతో భారీ జీతాలు

డేవిడ్ రష్ 2009లో ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో.. తనకు ‘క్లెమ్సన్ యూనివర్సిటీ’ నుండి బ్యాచిలర్ డిగ్రీ, అలాగే ‘రెన్‌సీలేర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్’ నుండి మాస్టర్స్ డిగ్రీ ఉన్నట్లు తప్పుడు పత్రాలను సమర్పించాడు. కానీ, దర్యాప్తులో అతడు ఈ రెండు విద్యాసంస్థల్లో ఎప్పుడూ చదవలేదని, ఆ సర్టిఫికెట్లన్నీ నకిలీవని తేలింది. ఉన్నత విద్యా అర్హతలు ఉన్నాయనే నెపంతో అతడు గత 20 ఏళ్లుగా ప్రభుత్వం నుండి భారీ స్థాయిలో అదనపు వేతనాన్ని, ప్రయోజనాలను పొందుతూ మోసానికి పాల్పడ్డాడు.

అంతేకాకుండా, తాను మిలిటరీలో పనిచేసినట్లు తప్పుడు ఆధారాలు చూపి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హోదాకు చేరుకున్నాడు. 2015లో నావికాదళం (Navy) నుండి గౌరవప్రదంగా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా, మిలిటరీ సెలవుల పేరిట 744 గంటల అదనపు వేతనాన్ని క్లెయిమ్ చేసి, తద్వారా సుమారు 77,000 డాలర్ల (రూ. 64 లక్షలకు పైగా) ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా ఆర్జించాడు.

ఆఫీస్ ఖర్చుల పేరిట బంగారం మాయం

సీఐఏ అంతర్గత విచారణలో డేవిడ్ రష్ అక్రమాలు బయటపడటంతో, ప్రస్తుత సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ఈ కేసును ఎఫ్‌బీఐ (FBI) దర్యాప్తునకు బదిలీ చేశారు. దర్యాప్తు అధికారులు రష్ కార్యాలయ రికార్డులను పరిశీలించగా మరో షాకింగ్ నిజం బయటపడింది. నవంబర్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో.. అతడు తన విధులకు సంబంధించిన అధికారిక ఖర్చుల (Work-related expenses) నిమిత్తం కోట్ల విలువైన విదేశీ కరెన్సీని, కోట్లాది డాలర్ల విలువైన బంగారు బిస్కెట్లను ప్రభుత్వ ఖజానా నుండి తీసుకున్నాడు. అయితే ఆఫీసు స్టోరేజీ గదులను తనిఖీ చేయగా ఆ బంగారం, నగదు అక్కడ కనిపించకుండా మాయమయ్యాయి.

ఇంట్లో సోదాలు.. బంగారం, రోలెక్స్ వాచీల గుట్టలు

ఈ క్రమంలో మే 18న ఎఫ్‌బీఐ అధికారులు డేవిడ్ రష్ నివాసంలో సెర్చ్ వారెంట్‌తో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ లభించిన సంపదను చూసి అధికారులు విస్తుపోయారు. రష్ తన ఇంట్లో దాచి ఉంచిన సుమారు 40 మిలియన్ డాలర్ల విలువైన 303 నిఖార్సైన బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2 మిలియన్ డాలర్ల (రూ. 16 కోట్లకు పైగా) నగదు, సుమారు మూడు డజన్ల అత్యంత ఖరీదైన లగ్జరీ వాచీలను (ముఖ్యంగా రోలెక్స్ బ్రాండ్) స్వాధీనం చేసుకున్నారు.

ఈ అక్రమాలపై ఎఫ్‌బీఐ మే 19న డేవిడ్ రష్‌ను అధికారికంగా అరెస్టు చేసింది. అరెస్ట్ సమయానికి అతడు సీఐఏ విధుల్లో లేడు. కాగా, రష్ అక్రమంగా పొందిన నిధులన్నింటినీ దాదాపుగా రికవరీ చేసినట్లు కేసుతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దీనిపై సీఐఏ మరియు ఎఫ్‌బీఐ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, “బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి, పూర్తి పారదర్శకతతో న్యాయాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం” అని తెలిపాయి. ప్రస్తుతం కస్టడీలో ఉన్న డేవిడ్ రష్‌కు జూన్ 5న కోర్టులో డిటెన్షన్ విచారణ జరగనుంది. ఒక ప్రతిష్ఠాత్మక గూఢచార సంస్థలోనే ఇంతటి భారీ మోసం జరగడం అమెరికా రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *