Last Updated:
Commonwealth Games 2026: స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం వేదికగా నేటి నుంచి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ఘనంగా ప్రారంభం కానున్నాయి. గతంలో బర్మింగ్‌హామ్‌లో సాధించిన అద్భుత విజయాలను ఈసారి పునరావృతం చేయడం భారత క్రీడా బృందానికి తీవ్ర సవాలుగా మారనుంది.
మహిళల క్రికెట్, హాకీ, కుస్తీ, షూటింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి పతకాలు తెచ్చిపెట్టే కీలక క్రీడలను ఈసారి కామన్వెల్త్ విభాగం నుంచి తొలగించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో భారత పతకాల ఆశలన్నీ ఇప్పుడు అథ్లెటిక్స్, వేట్‌లిఫ్టింగ్, బాక్సింగ్ విభాగాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఓవో హైడ్రో మైదానంలో గురువారం జరిగే ప్రారంభ వేడుకలతో ఈ క్రీడలు అధికారికంగా షురూ కానున్నాయి. బడ్జెట్ కోతల కారణంగా ఈసారి కేవలం 10 రకాల క్రీడల్లో మాత్రమే పోటీలు నిర్వహించనున్నారు. 74 దేశాల నుంచి దాదాపు 3,000 మంది క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాణించాలని భావిస్తున్నారు. గత మూడు దశాబ్దాలలో ఇంత తక్కువ సంఖ్యలో పోటీలతో క్రీడలు జరగడం ఇదే తొలిసారి.
వాస్తవానికి ఈ క్రీడలకు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రావిన్స్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే పెరుగుతున్న నిర్మాణ వ్యయం కారణంగా విక్టోరియా తప్పుకోవడంతో, కామన్వెల్త్ గేమ్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ దశలో గ్లాస్గో ముందుకొచ్చి ఆతిథ్య బాధ్యతలు స్వీకరించింది. 2014లోనూ ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన స్కాట్లాండ్, ఈసారి దాదాపు 160 మిలియన్ పౌండ్ల వ్యయంతో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్ బడ్జెట్ కంటే ఏకంగా 60 శాతం తక్కువ కావడం గమనార్హం.
2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వరుసగా ప్రతీసారి పతకాల పట్టికలో అగ్ర ఐదు స్థానాల్లో నిలుస్తూ వస్తున్న భారత్‌కు ఈసారి ఆ ఘనతను కాపాడుకోవడం కష్టంగా మారేలా ఉంది. బర్మింగ్‌హామ్‌లో భారత్ గెలుచుకున్న 61 పతకాల్లో సగానికి పైగా హాకీ, కుస్తీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ నుంచే వచ్చాయి. ఇప్పుడు ఈ ఐదు క్రీడలూ టోర్నీలో లేకపోవడంతో భారత ఆశలన్నీ అథ్లెటిక్స్, బాక్సింగ్, వేట్‌లిఫ్టింగ్‌లపైనే నిలిచాయి.
భారత్ ఈసారి అథ్లెటిక్స్‌లో 32 మంది సభ్యులతో కూడిన పెద్ద బృందాన్ని బరిలోకి దింపుతోంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన స్టార్ జావెలెన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు హైజంప్‌లో సర్వేష్ కుషారే, లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్, పురుషుల, మహిళల 4×400 మీటర్ల రిలే జట్లు కూడా పతక రేసులో ఉన్నాయి. బర్మింగ్‌హామ్‌లో భారత్ అథ్లెటిక్స్ నుంచి 8 పతకాలు సాధించింది.
వేట్‌లిఫ్టింగ్‌లో అందరి దృష్టి ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను (31)పైనే ఉంది. గత రెండు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన చాను, ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. అయితే జాతీయ క్యాంప్‌లో పలువురు క్రీడాకారులు డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడంతో, ఈసారి భారత్ నుంచి కేవలం 11 మంది వేట్‌లిఫ్టర్లు మాత్రమే పాల్గొంటున్నారు.
బాక్సింగ్‌లో టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో తొలి పతకాన్ని వేటాడుతున్నారు. ప్రపంచ ఛాంపియన్ జైస్మీన్ లంబోరియా (57 కేజీలు) గతంలో సాధించిన కాంస్యాన్ని స్వర్ణంగా మార్చాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆసియా ఛాంపియన్లు ప్రీతి పవార్ (54 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు)తో పాటు పురుషుల విభాగంలో నరేందర్ బెర్వాల్ (+90 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) పతక రేసులో ముందంజలో ఉన్నారు. వీరితో పాటు జూడో, లాన్ బాల్స్, పారా-అథ్లెటిక్స్ విభాగాల్లోనూ భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేసి పతకాల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి ఆరు క్రీడల్లో పారా ఈవెంట్లను కూడా కలిపి నిర్వహిస్తున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jul 23, 2026 12:12 PM IST














