Last Updated:
ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, దేశాన్ని కుదిపేస్తున్న పరీక్షా పేపర్ల లీకేజీల వంటి కీలక అంశాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Congress: దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక సమస్యలపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, దేశాన్ని కుదిపేస్తున్న పరీక్షా పేపర్ల లీకేజీల వంటి కీలక అంశాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అత్యవసర సమావేశాన్ని గురువారం నిర్వహించింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
సమావేశం ముగిసిన అనంతరం పార్టీ నిర్ణయాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రజాస్వామ్య విలువలు పతనమవుతుంటే.. మరోవైపు సామాన్య ప్రజలు తమ జీవనోపాధి కోసం, నిత్య జీవిత అవసరాల కోసం తీవ్రంగా పోరాడాల్సి వస్తోందని అన్నారు.
“రాబోయే రెండు మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రజా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాం. ఈ ఉద్యమం కేవలం దిల్లీకో, రాష్ట్ర రాజధానులకో పరిమితం కాదు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కింది స్థాయి నుండి కార్యక్రమాలను నిర్వహిస్తాం. కష్టాల్లో ఉన్న ప్రతి సామాన్యుడి వద్దకు కాంగ్రెస్ నాయకులు స్వయంగా వెళ్లి వారికి సంఘీభావం ప్రకటిస్తారు. ఈ ఉద్యమం ముగిసే వరకు కాంగ్రెస్ నేతలంతా ప్రజల మధ్య రోడ్లపైనే ఉంటారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ, రూట్ మ్యాప్‌ను మరో నాలుగైదు రోజుల్లో అధికారికంగా విడుదల చేస్తాం” అని వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ఈ అత్యవసర సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సైద్ధాంతికంగా బలమైన పునాదులు కలిగి, ఎక్కడా విచ్ఛిన్నం కాని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఉద్ఘాటించారు. దేశాన్ని విభజించేలా వ్యవహరిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ (RSS) ల వైఖరిపై నిరంతరాయంగా పోరాటం చేయడానికి సరైన వేదిక తమ పార్టీయేనని ఆయన నొక్కిచెప్పారు.
ఇదే సమయంలో మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓట్ల చోరీకి పాల్పడిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో ‘సీట్ల చోరీ’కి దిగిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ని తంటాలు పడినా, దానికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీని బీజేపీ ఎప్పటికీ సాధించలేదని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఓట్ల చోరీతో పాటు, సీట్ల చోరీకి అలవాటు పడ్డాయని దుయ్యబట్టారు. మొత్తానికి, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను అజెండాగా చేసుకుని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధమవడంతో, దేశ రాజకీయం మరోసారి వేడెక్కనుంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana











