Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. గాజాలో యుద్ధానికి చెక్! | | ACTPnews


Last Updated:

గాజాలో శాంతి స్థాపన దిశగా చారిత్రక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హమాస్ సహా ఇతర సాయుధ వర్గాల పూర్తి నిరాయుధీకరణకు అంగీకారం కుదిరిందని, త్వరలో ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు.

News18
News18

దశాబ్దాలుగా రగులుతున్న గాజాలో శాంతి స్థాపనకు కీలక ముందడుగు పడింది. హమాస్ సహా ఇతర సాయుధ వర్గాల పూర్తి నిరాయుధీకరణ కోసం తమ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఒక చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక వివరాలు పంచుకున్నారు. సుదీర్ఘ శాంతి, భద్రతల దిశగా ఇదొక అద్భుతమైన పరిణామంగా ట్రంప్ అభివర్ణించారు.

తాజా ఒప్పందం ద్వారా గాజాలో స్వతంత్రంగా పనిచేసే కొత్త పాలస్తీనా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ఒప్పందాన్ని దశలవారీగా అమలు చేస్తామని, నిరాయుధీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ ఇజ్రాయెల్ బలగాలు క్రమంగా గాజా నుంచి వెనక్కి వస్తాయని ట్రంప్ వెల్లడించారు. భవిష్యత్తులో గాజాలో భద్రతను పర్యవేక్షించడానికి ‘అంతర్జాతీయ స్థిరీకరణ దళం’, కొత్తగా ఏర్పాటయ్యే పాలస్తీనా పోలీసు బలగాలతో కలిసి సంయుక్తంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఒప్పందాన్ని ధృవీకరించిన హమాస్

ట్రంప్ ప్రకటన తర్వాత హమాస్ సీనియర్ అధికారులు కూడా ఈ ఒప్పందంపై స్పందించారు. ఆయుధాల అప్పగింత, ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ తదితర కీలక అంశాలపై అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. మధ్యవర్తులు, బోర్డ్ ఆఫ్ పీస్ చొరవతో ఇజ్రాయెల్ ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు హమాస్ ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. ట్రంప్ సూచించిన 20-అంశాల శాంతి ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకోనున్నారు.

ఈజిప్ట్, ఖతార్‌కు ట్రంప్ కృతజ్ఞతలు

ఈ చారిత్రక ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ దేశాలకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది కాలంగా గాజాలో కొనసాగిన భయంకరమైన యుద్ధం, తీవ్రమైన మానవతా సంక్షోభం, బందీల కష్టాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు తగిన భద్రత లభిస్తుందని, భవిష్యత్తులో గాజాను ఉగ్రవాద స్థావరంగా మార్చే అవకాశం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. శాంతి ప్రక్రియలో మనం గొప్ప పురోగతి సాధించామని అన్నారు.

కైరోలో తదుపరి చర్చలు

ఈ శాంతి ప్రణాళిక తదుపరి దశ అమలుపై చర్చించేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్, టర్కీ ప్రతినిధులు త్వరలో కైరోలో సమావేశం కానున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, తెరవెనుక శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ గాజాలో హింస పూర్తిగా ఆగలేదు. గురువారం జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports