డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాలని పోలీసులకు మనదేశంలో ఇచ్చిన అధికారం, గౌరవం, స్వేచ్ఛ మరెవ్వరికి కల్పించలేదు రాజ్యాంగం. అయితే దీన్ని చాలా మంది సద్వినియోగం చేసుకోవడం కంటే దుర్వినియోగం చేస్తున్నారే విమర్శలు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వినిపించడం కాదు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణరెడ్డి నుండి మొదలు పెడితే తర్వాత జూబ్లిహిల్స్ సీఐ శ్రీనివాసులు ఆయన బాటలోనే మలక్‌పేట్ సీఐ కె. నరసింహ ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆధారాలతో సహా అడ్డంగా బుక్కైపోయారు. అసలు వీళ్ల ముగ్గురు ఎలా ఆడవాళ్ల విషయంలో విలన్లుగా మారిపోయారో వివరంగా చెప్పే ప్రయత్నం ఈ స్టోరీ ద్వారా చేస్తున్నాం.
ఇంకా ట్రైనింగ్ పూర్తి కూడా చేయలేదు. దేశం గర్వించే పోలీస్ శిక్షణ అకాడమీలో ఉండగానే ఊహించని విధంగా తోడి ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈకేసు ఆరోపణలతో మొదలయి.. వాస్తవం అనే నిర్ధారణ కావడంతో కేసు రాష్ట్రం దాటి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణరెడ్డి 2026 జూన్ 23న సాటి ట్రైనీ లేడీ ఐపీఎస్‌తో లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. బాధితురాలు తన పట్ల ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తించిన తీరు చూసి విచారణలో అవన్నీ నిజమని తేలడంతో పోలీసులే షాక్ అయ్యారు. ముందుగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలికి వాట్సాప్ ద్వారా అగ్లీ మెసేజ్‌లు పంపడమే కాకుండా తోటి ట్రైనీ ఐపీఎస్‌ల ముందు ఆమెను కించపరచడం, ఆమె ఫోన్‌ను బలవంతంగా లాక్కోవడంతో పాటు ఆమెను తన గదిలో అక్రమంగా నిర్బంధించినట్లుగా సదరు బాధితురాలు పోలీస్ కంప్లైంట్ లో నిజాల్ని బయటపెట్టింది.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరాచకాలు అంతటితో ఆపకుండా వాటిని పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఎంతలా అంటే ఆమెను జుట్టుపట్టుకొని లాగడం, గొంతు నులిమడం చివరకు ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియోను రహస్యంగా రికార్డ్ చేసి దాన్ని ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేసేంతటి నీచానికి ఒడగట్టినట్లుగా బాధితురాలు పోలీసు కంప్లైంట్‌లో తెలిపింది. సాటి ట్రైనీ ఐపీఎస్ అనే గౌరవం, బయటకు చెప్పుకుంటే అమర్యాదగా ఉంటుందేమో , మహిళగా తన పరువు పోతుందనే ఒక్క ఆలోచనతో వారం రోజులు టార్చర్ భరించినప్పటికి జూలై 10న ఆమెపై మరోసారి దాడి చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వాళ్లే కావడంతో బాధితురాలి కంప్లైంట్, ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత మెడికల్ టెస్టులు, ఫోన్ రికార్డ్స్ ఆధారంగా అవన్నీ నిజమేనని స్పష్టమయ్యాయి. దాంతో BNS, ఐటీ చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తనపై మహిళ ట్రైనీ ఐపీఎస్ చేసినవన్ని ఆరోపణలే అని బుకాయించే ప్రయత్నం చేసేందుకు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టాడు. తప్పించుకునేందుకు పోలీసులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం, గాలిస్తున్నారని పరారీలో ఉండటం వంటి క్రిమినల్ తరహాలో ప్రవర్తించడంతో పోలీసులు అతని గాలించేందుకు 4 ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపడంతో చివరకు మిర్యాలగూడ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరిచారు.ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం ఆయనను చర్లపల్లి సెంట్రల్ జైలుకు పంపారు.
ఎన్నో నేరాలు చేస్తే నమోదు చేసే సెక్షన్లు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేశారు. లైంగిక దాడి, స్టాకింగ్, బెదిరింపులు, ఐటీ చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా XXV అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి అనే ప్రస్తుత ట్రైనీ ఐపీఎస్ గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి 2025 UPSC సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం శివరాంపల్లిలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVP NPA)లో శిక్షణ పొందుతున్న సమయంలో సాటి ట్రైనీ పోలీస్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడంతో ఈ క్రిమినల్ అధికారి క్రైమ్ చిట్టా బయటపడింది. అయితే
2025 మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళా ఐపీఎస్ ట్రైనీతో క్లోజ్‌గా మూవ్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనింగ్ సమయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు, భావోద్వేగ ఒత్తిడి, అధిక స్వాధీన భావం, అస్థిర ప్రవర్తన కొనసాగినట్లుగా దర్యాప్తులో గుర్తించారు పోలీసులు.
అంతే కాదు నిందితుడు పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఆయుధాలు చూపించడం, బాధితురాలిని అవమానించడం, ఒకేసారి పలువురితో సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడం వంటి ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు సంబంధాన్ని ముగించి మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా నిందితుడు నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, వ్యక్తిగత చాట్‌లు బయటపెడతానని బెదిరించడం, ఆమె కుటుంబ సభ్యులు, సహచరులను అనుమతి లేకుండా సంప్రదించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో బాధితురాలు, ఇతర సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన డిజిటల్ ఆధారాల ఆధారంగా నిందితుడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారించామని పోలీసులు వెల్లడించారు.
ఈ పోలీస్ ఆఫీసర్ కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తూనే అరాచకాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లొంగదీసుకొని.. శారీరకంగా వాడుకున్నాడని సీఐ శ్రీనివాసులు రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు అతనిపై ఫిర్యాదు చేసిన మహిళ ప్రైవేట్ వీడియోస్ తీసి, వాటిని అడ్డం పెట్టుకొని, డబ్బులు దోచుకున్నట్టు విచారణలో వెల్లడైంది.
బాధిత మహిళ, సీఐ కొన్నాళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. ఆమెని విడిపించుకోవడం శ్రీనివాసులు విశ్వప్రయత్నాలు చేసినట్లు గుర్తించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి గర్భం దాల్చిన తరువాత బెదిరించి అబార్షన్ చేయించి, రహస్యంగా చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి రూ.2 కోట్ల వరకు దోచుకున్నట్లుగా అన్ని ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి, శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు. ఈకేసులో ఇంకా పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని.. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్న అధికారులు తెలిపారు.
జూబ్లిహిల్స్ సీఐ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వేరే మహిళను లైంగికంగా వేధింపులకు పాల్పిడితే మలక్ పేట సీఐ నరసింహ తమ డిపార్ట్ మెంట్లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆమెపైనే వేధింపులకు దిగాడు.విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలతో మలక్‌పేట్ సీఐ కె. నరసింహను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. గతంలో సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను వేధించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని, అనంతరం ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో శాఖాపరమైన చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం. అదే సమయంలో మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకుని, వారికి ఒక కుమారుడు ఉన్నారని ఆరోపిస్తూ మొదటి భార్య కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై శాఖాపరమైన, చట్టపరమైన విచారణ కొనసాగుతోంది.
ఒంటిపై ఖాకీ యూనిఫామ్ వేసుకొని కరెక్ట్‌గా పని చేయాల్సిన పోలీస్ అధికారులు ఈవిధంగా కామాంధులుగా మారిపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంతో మందికి దక్కని గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి క్రైమ్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అంతే కాదు ఇలాంటి వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే డిపార్ట్‌మెంట్‌లో మరెవరూ అలాంటి తప్పులు చేయకుండా ఉండేలా కఠిన శిక్షలు వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.













