Last Updated:
Ebola virus India: ఇండియాలో ఎబోలా కేసులు లేవు. ఇది నిజం. కాకపోతే.. ఒక కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుడటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడే సమస్య వచ్చింది. అందుకే కేంద్రం అప్రమత్తమైంది.
కాంగో, ఉగాండా తదితర ఆఫ్రికా దేశాల్లో ఎబోలా (Ebola Virus) వ్యాధి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలాలోని అత్యంత ప్రమాదకరమైన ‘బుండిబుగ్యో’ (Bundibugyo) స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా గైడ్‌లైన్స్ జారీ చేసింది. ముఖ్యంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని భారతీయులను కోరినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో – PIB అధికారిక ప్రకటన ద్వారా చెప్పింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన:
తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మే 17, 2026న ఈ ఎబోలా వ్యాప్తిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)’ గా ప్రకటించింది. అలాగే ఆఫ్రికా సీడీసీ (Africa CDC) సైతం దీనిని ఖండాంతర భద్రతా ముప్పుగా (PHECS) పరిగణించిందని ‘ద హిందూ’ పత్రిక తన నివేదికలో తెలిపింది. ఈ ప్రమాదకర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మే చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, విమానాశ్రయాల్లో పటిష్టమైన స్క్రీనింగ్, నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఇప్పటివరకు ఎబోలా (బుండిబుగ్యో స్ట్రెయిన్) కేసులు ఏవీ నమోదు కాలేదనీ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్తగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.
ప్రయాణికులకు స్వీయ నిర్బంధ (Self-Isolation) సూచనలు:
గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి నేరుగా వచ్చిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించి వచ్చిన వారు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ గట్టిగా సూచించింది. ఒకవేళ ఆ ప్రయాణికులలో అకస్మాత్తుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, లేదా శరీరంలో ఎక్కడినుంచైనా అకారణంగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలి. సాయం కోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ‘1075’ కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేసింది. సకాలంలో వైద్య సహాయం పొందడం ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా, ఇతరులకు వ్యాధి సోకకుండా నిరోధించవచ్చని ది హిందూ రిపోర్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) పంపింది. ఆసుపత్రులలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, పరీక్షల కోసం ల్యాబొరేటరీలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలని.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. విమానాశ్రయంలో ఎవరైనా అనుమానిత రోగులు గుర్తిస్తే వెంటనే వారిని ప్రత్యేక అంబులెన్సుల ద్వారా ఐసోలేషన్ సెంటర్లకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
బుండిబుగ్యో స్ట్రెయిన్ ప్రమాదం ఏంటి?:
ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాపిస్తున్న ‘బుండిబుగ్యో’ వైరస్ రకానికి ఎలాంటి వ్యాక్సిన్లు గానీ, నిర్దిష్టమైన చికిత్స విధానం గానీ ప్రస్తుతానికి అందుబాటులో లేవని WHO స్పష్టం చేసింది. ఇది సోకిన వ్యక్తి శారీరక ద్రవాలను తాకడం వల్ల ఇతరులకు అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని ‘డౌన్ టు ఎర్త్’ పత్రిక వెల్లడించింది. సుమారు వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా, 200లకు పైగా మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













