Last Updated:
అలాగే డిజిటల్ వీక్షకుల కోసం ‘జీ5’ (Zee5) ఓటీటీ యాప్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన తర్వాత మళ్లీ ఉత్తర అమెరికా ఖండంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను భారత అభిమానులు వీక్షించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది.
FIFA World Cup 2026: భారతదేశంలో ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ (FIFA World Cup 2026) ప్రత్యక్ష ప్రసారాలపై గత కొంతకాలంగా నెలకొన్న సుదీర్ఘ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. ఫుట్‌బాల్ పండుగ ప్రారంభానికి మరో రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో.. ప్రముఖ మీడియా సంస్థ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్’ (ZEEL) ఈ మెగా టోర్నీ భారత ప్రసార హక్కులను అధికారికంగా సొంతం చేసుకుంది.
అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్ టోర్నీ జూన్ 11 నుండి ప్రారంభం కానుంది. భారత్‌లో ఈ మ్యాచ్‌లు ‘జీ’ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘యునైట్8 స్పోర్ట్స్’ ఛానళ్లలో టీవీ ప్రసారం కానున్నాయి. అలాగే డిజిటల్ వీక్షకుల కోసం ‘జీ5’ (Zee5) ఓటీటీ యాప్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన తర్వాత మళ్లీ ఉత్తర అమెరికా ఖండంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను భారత అభిమానులు వీక్షించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది.
2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల సమయాలు భారత వీక్షకులకు ఎంతో అనుకూలంగా ఉండటంతో ‘వయాకామ్18’ (Viacom18) భారీ ధరకు హక్కులను కొనుగోలు చేసింది. కానీ, ఈసారి మ్యాచ్‌లు ఉత్తర అమెరికా టైమ్ జోన్ల ప్రకారం జరుగుతుండటంతో భారత కాలమానానికి, అక్కడి కాలమానానికి చాలా వ్యత్యాసం ఉంది. అర్ధరాత్రి, తెల్లవారుజామున మ్యాచ్‌లు ఉండటం వల్ల వ్యూవర్‌షిప్ తగ్గుతుందనే ఆందోళనతో భారతదేశంలోని పలు అగ్రశ్రేణి బ్రాడ్‌కాస్టర్లు ఈసారి వేలంలో పాల్గొనడానికి వెనుకడగు వేశాయి. వారాల తరబడి సాగిన చర్చల అనంతరం ‘జీ’ సంస్థ రంగంలోకి దిగి ఈ హక్కులను దక్కించుకుంది.
ఈ ఒప్పందం కేవలం 2026 ప్రపంచకప్‌కే పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య (FIFA)తో జీ గ్రూప్ ఏకంగా ఎనిమిదేళ్ల (8 Years) సుదీర్ఘ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం 2034 వరకు జరిగే పలు కీలక అంతర్జాతీయ టోర్నీల హక్కులు జీ వశమయ్యాయి.
ఫిఫా పురుషుల వరల్డ్ కప్ 2026, 2030.
ఫిఫా మహిళల వరల్డ్ కప్ 2027.
ఏ ఛానళ్లలో మ్యాచ్‌లు వస్తాయి?
భారత్‌లో ఫుట్‌బాల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు, క్రీడా విభాగంలో మరింత దూసుకెళ్లేందుకు జీ నెట్‌వర్క్ ప్రత్యేకంగా నాలుగు స్పోర్ట్స్ ఛానళ్లను లాంచ్ చేసింది.
యునైట్8 స్పోర్ట్స్ 1 (Unite8 Sports 1)
యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డీ (Unite8 Sports 1 HD)
యునైట్8 స్పోర్ట్స్ 2 (Unite8 Sports 2)
యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీ (Unite8 Sports 2 HD)
ఈ టోర్నీని లైవ్‌లో చూడాలనుకునే భారత ఫుట్‌బాల్ ప్రియులు రాత్రిళ్లు నిద్రలు మానుకోవడానికి సిద్ధం కావాల్సిందే. అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్ వంటి నగరాల్లో జరిగే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం (IST) సాధారణంగా రాత్రి 9:30 నుండి రాత్రి 10:30 గంటల మధ్య ప్రారంభమవుతాయి. పసిఫిక్ తీర నగరాలైన వాంకోవర్, శాన్ ఫ్రాన్సిస్కోలలో జరిగే మ్యాచ్‌లు కాస్త ఆలస్యంగా.. అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇక టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్, సెమీఫైనల్స్, అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో ఫుట్‌బాల్ అభిమానులకు అర్ధరాత్రి వేళల్లో అసలైన మజా లభించనుంది.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jun 02, 2026 11:28 AM IST













