Last Updated:
దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాం, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వరద పరిస్థితులు భయంకరంగా మారాయి. డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కష్టకాలంలో బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో శనివారం నాటికి వరద పోటెత్తడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు నీట మునిగాయి. అస్సాంలో వరద ఉధృతికి మృతుల సంఖ్య 82కి చేరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా దాదాపు 1.93 లక్షల మంది వరద గుప్పిట్లోనే చిక్కుకున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. బాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, మందులు అందిస్తున్నారు.
అటు కేరళలోనూ కుండపోత వర్షాలకు ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడంతో అస్సాంలో పరిస్థితి మరింత విషమంగా మారింది.
కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. విపత్తు ప్రతిస్పందన దళాలు, స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. వరద బాధితుల కోసం 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 1,465 మంది తలదాచుకుంటున్నారు.
భారీ వర్షాల ధాటికి 17 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 127 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కోజికోడ్‌లోని అనక్కంపోయిల్‌లో 35 గంటల్లో 340 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వాయనాడ్‌లోని మేప్పాడిలో 177 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం కొన్ని చోట్ల వర్షాలు తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఒడిశాలో ఈ సీజన్‌లోనే అత్యంత దారుణమైన వరద పరిస్థితులు నెలకొన్నాయి. మహానది, బ్రాహ్మణి, బైతరణి, సుబర్ణరేఖ నదులు ఉప్పొంగుతుండటంతో 20 జిల్లాల్లో సుమారు 8.34 లక్షల మంది వరద బారిన పడ్డారు. ఉత్తర ఒడిశాలో 1,300కు పైగా ఇళ్లు ధ్వంసం కాగా భద్రక్, జాజ్‌పూర్, బాలాసోర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హీరాకుడ్ జలాశయం 22 గేట్లు ఎత్తివేసి దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేస్తుండటంతో మహానది పరీవాహక ప్రాంతంలోని 10 జిల్లాలను అధికారులు హై అలర్ట్‌లో ఉంచారు. కటక్ సమీపంలోని ముండలి బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులకు తగ్గినా, తీరప్రాంత జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, సహాయక కార్యక్రమాల కోసం విపత్తు ప్రతిస్పందన నిధికి రూ. 26 కోట్లు కేటాయించామని తెలిపారు.
వరద తగ్గిన వెంటనే మూడు రోజుల్లో పంట నష్టం, మౌలిక సదుపాయాల నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆందోళన చెందవద్దని ప్రజలకు ధైర్యం చెప్పారు. గడచిన రెండు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరద పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














