France Heatwave: ఫ్రాన్స్‌లో భానుడి భగభగలు.. వడగాల్పుల ధాటికి 1,000 మంది మృతి.. 85 శాతం వృద్ధులే! | | ACTPnews

హీట్ వేవ్


Last Updated:

France Heatwave: ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో కూడిన తీవ్రమైన హీట్‌వేవ్ (వడగాల్పులు) పెను విషాదాన్ని నింపింది. ఈ విపరీతమైన ఎండల కారణంగా దేశంలో అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు 1,000 మంది మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.

హీట్ వేవ్
హీట్ వేవ్

ఈ మరణాలలో అత్యధికంగా 85 శాతం మంది వృద్ధులే కావడం గమనార్హం. “జూన్ 24 నుండి ఇప్పటివరకు, గత నెలలతో పోలిస్తే దాదాపు 1,000 అదనపు మరణాలు (ప్రాథమిక గణాంకాల ప్రకారం) నమోదయ్యాయి” అని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన ఎండల కారణంగా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించిన ప్రాంతాలు ఈ హీట్‌వేవ్‌కు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, మరణించిన వారిలో 85 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారేనని అంతర్జాతీయ వార్తా సంస్థ ‘AFP’ పేర్కొంది.

ఇళ్లలోనే ప్రాణాలు విడిచిన జనం

ప్యారిస్, దాని పరిసర ప్రాంతాలతో కూడిన ‘ఐల్-డి-ఫ్రాన్స్’ రీజియన్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రుల కంటే ఇళ్లలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

“పెద్ద నగరాల్లో ఒంటరిగా జీవిస్తున్న లేదా తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్న ప్రజల పట్ల సామాజిక బాధ్యత, సంఘీభావ చర్యలు అవసరమని ఈ ఘోరకలి గుర్తు చేస్తోంది” అని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ పేర్కొంది. అంతేకాకుండా, ప్రస్తుతం అందిన మరణాల సంఖ్య కేవలం ప్రాథమికమైనదేనని, అసలు మరణాల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

150 ఏళ్ల రికార్డులు బద్దలు

ఈ వడగాల్పుల తీవ్రతకు ఫ్రాన్స్ దేశం విలవిలలాడిపోయింది. ఎండల బారి నుండి తప్పించుకోవడానికి ప్రజలు షాపింగ్ మాల్స్‌లోని ఎయిర్ కండిషనర్లు, కూలింగ్ యూనిట్ల చుట్టూ గుంపులుగా చేరుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్యారిస్‌లో సరికొత్త రికార్డు: ఈ ఒక్క వారంలోనే ప్యారిస్ నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన రోజుల సంఖ్య, 1872 నుండి 2019 వరకు (దాదాపు 150 ఏళ్లలో) నమోదైన మొత్తం రోజుల కంటే ఎక్కువ. ఇది ప్రస్తుత హీట్‌వేవ్ తీవ్రతకు అద్దం పడుతోంది.

అయితే, గత కొన్ని రోజులుగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ఫ్రాన్స్ ప్రజలకు ఆదివారం కొద్దిగా ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వాతావరణ శాఖ తెలిపింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports