Fridge Blast: అర్ధరాత్రి పేలిన ఫ్రిజ్.. నలుగురు మహిళలు సజీవ దహనం! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Fridge Blast: వినాయక చవితి పండుగ వేళ ఆ ఇంట్లో నెలకొన్న ఆనందోత్సాహాలు అర్ధరాత్రికల్లా తీరని శోకంగా మారాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఊహించని రీతిలో ఫ్రిజ్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. కర్ణాటకలోని బెళగావి నగరంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పండుగ పూట వెలుగులు.. అర్ధరాత్రి చీకట్లు

బెళగావి నగరం పరిధిలోని చౌవాటవీధిలో గజానన (65) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కార్లకు రంగులు వేసే పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని పోషిస్తున్నారు. గజాననకు భార్య శారద (48), కుమార్తెలు ప్రియ (28), గంగ (25), కుమారుడు రోషన్ (21) ఉన్నారు. వీరితో పాటే గజానన సోదరి భారతి (50) కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. సోమవారం వినాయక చవితి పర్వదినం కావడంతో కుటుంబసభ్యులంతా ఎంతో ఉత్సాహంగా పూజలు నిర్వహించారు. బంధుమిత్రులను పిలిచి ప్రసాదాలు పంచుకున్నారు. రోజంతా పండుగ సంబరాల్లో గడిపిన కుటుంబసభ్యులు, రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. అయితే, ఆ సంతోషం కొద్ది గంటలైనా నిలవలేదు.

షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫ్రిజ్.. క్షణాల్లో ఎగిసిపడిన మంటలు

అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల సమయంలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీని ప్రభావంతో ఒక్కసారిగా ఫ్రిజ్ కంప్రెసర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి మంటలు చెలరేగి వేగంగా ఇల్లంతా వ్యాపించాయి. వీరు నివసిస్తున్నది రేకుల షెడ్ కావడంతో పాటు ఇంట్లోని వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రికి నిప్పు అంటుకోవడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దట్టమైన విష పొగలు గదులను కమ్మేశాయి. గాఢనిద్రలో ఉన్న కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చుట్టూ అగ్నికీలలు చుట్టుముట్టాయి. బయటకు వచ్చే మార్గం మూసుకుపోవడంతో వారు తీవ్ర ఆర్తనాదాలు చేశారు.

స్థానికుల ఆర్తనాదాలు.. నిస్సహాయ స్థితి

అర్ధరాత్రి వేళ వినిపించిన భారీ పేలుడు శబ్దం, అనంతరం బాధితుల కేకలు విని చుట్టుపక్కల నివసించే కాలనీవాసులు ఉలిక్కిపడి లేచారు. మంటలు ఎగసిపడుతున్న రేకుల షెడ్డు వద్దకు పరుగులు తీసి, నీళ్లు చల్లుతూ లోపల ఉన్నవారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడం, లోపలి నుంచి తలుపులు రాకపోవడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికుల ప్రయత్నాలు ఫలించలేదు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

నలుగురు మహిళలు సజీవ దహనం

ఈ ఘోర అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయిన శారద (48), ఆమె కుమార్తెలు ప్రియ (28), గంగ (25), గజానన సోదరి భారతి (50) మంటల్లో కాలి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. కుటుంబ యజమాని గజానన, కుమారుడు రోషన్ శరీరాలు తీవ్రంగా కాలిపోయిన స్థితిలో బయటపడ్డారు. వారిని పోలీసులు వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం బెళగావి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఒకే కుటుంబంలో నలుగురు మహిళలు విగతజీవులుగా మారడంతో ఘటనా స్థలంలో దృశ్యాలు చూపరులను కలచివేశాయి. కాలనీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, షార్ట్ సర్క్యూట్‌కు గల ఖచ్చితమైన కారణాలు, ఫ్రిజ్ పేలుడు తీరుపై క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports