Hyderabad: మళ్లీ పంజా విసిరిన క్యూనెట్.. విలాసవంత వ్యాపారం పేరిట మోసాలు.. గోవాలో ఐదుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Hyderabad: మల్టీలెవల్ మార్కెటింగ్ (MLM) పేరిట దేశవ్యాప్తంగా వేలాది మందిని ముంచిన ‘క్యూనెట్’ (విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్) కొత్త అవతారంలో మళ్లీ మోసాలకు తెరలేపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

విలాసవంతమైన వస్తువుల వ్యాపారం పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గోవాలో ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు ఖరీదైన కార్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సోషల్ మీడియానే వేదిక.. గోవాలో నెట్‌వర్క్!

కేరళకు చెందిన మహమ్మద్ ఫవాజ్, అశ్విన్ సురేష్, వినుజాన్సన్ డిక్రూజ్, మనోజ్ రవీంద్రన్ నాయర్, శివరాజన్ బాలరాజ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా క్యూనెట్ సంస్థకు స్వతంత్ర ప్రతినిధులుగా చలామణి అవుతూ, విలాసవంతమైన వస్తువుల వ్యాపారంతో స్వల్పకాలంలోనే లక్షలు సంపాదించవచ్చంటూ సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలు ఇచ్చేవారు.

ఈ ప్రకటనలు నమ్మి సంప్రదించిన వారిని మొదట బెంగళూరుకు, ఆ తర్వాత గోవాకు రప్పించేవారు. అక్కడి కండోలిమ్ ప్రాంతంలోని ఓ లగ్జరీ హోటల్‌లో కంపెనీ 25వ వార్షికోత్సవం పేరిట ప్రత్యేక సదస్సులు నిర్వహించి పెట్టుబడిదారులను నమ్మించే ప్రయత్నం చేశారు.

మోసం బయటపడిందిలా..

హైదరాబాద్‌కు చెందిన సర్దార్ శరణ్‌పాల్ సింగ్ జిమ్ ఏర్పాటు కోసం ఆన్‌లైన్ ద్వారా స్థలం వెతుకుతుండగా, నిందితుడు మహమ్మద్ ఫవాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని సంప్రదించాడు. వ్యాపార అవకాశం పేరిట బెంగళూరు రప్పించి, ఆపై గోవా సదస్సుకు హాజరుకావాలని ఒత్తిడి చేస్తూ రూ.30 వేలు వసూలు చేశాడు.

తన వద్ద దందా పేరిట మరో రూ.35 వేలు కొట్టేసి మోసానికి యత్నిస్తున్నారని గ్రహించిన శరణ్‌పాల్ సింగ్ వెంటనే హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

గోవాలో చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ డీసీపీ చైతన్యకుమార్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, సుధాకర్‌రావులతో కూడిన ప్రత్యేక బృందం గోవాకు వెళ్లింది. హోటల్ నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మపుసా కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై వారిని హైదరాబాద్‌కు తరలించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. మల్టీలెవల్ మార్కెటింగ్, క్యూనెట్ వంటి మోసపూరిత పథకాల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed