Last Updated:
ఏడేళ్ల అబ్దుల్ వహీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ఏలియాస్ హిజాన్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మండల వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు. ఈ నేరంలో నిందితుడికి సహకరించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.
Hyderabad: ఆర్థిక లావాదేవీల గొడవలు చివరకు ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్న దారుణ ఘటనలో మేడ్చల్-మల్కాజిగిరి 3వ అదనపు కోర్టు కీలక తీర్పును వెలువరించింది. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏడేళ్ల అబ్దుల్ వహీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ఏలియాస్ హిజాన్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మండల వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు. ఈ నేరంలో నిందితుడికి సహకరించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.
ఈనాడు కథనం ప్రకారం.. సనత్‌నగర్ అల్లావుద్దీన్ కోఠి బస్తీకి చెందిన వశీంఖాన్ అనే వ్యక్తి దుస్తుల వ్యాపారం చేసేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వహీద్(8) ఉన్నారు. వశీంఖాన్ తన ఇంటి సమీపంలో చిట్టీల వ్యాపారం చేసే ట్రాన్స్‌జెండర్ ఇమ్రాన్ ఖాన్ వద్ద చిట్టీలు వేశాడు. కొవిడ్ సమయంలో కూడా అతనికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. అయితే, తాను ఇచ్చిన సుమారు రూ.7 లక్షలు తిరిగి ఇవ్వాలని వశీంఖాన్ అడగడంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం మొదలైంది. వశీంఖాన్ మీద ఉన్న కక్షను అతని కుమారుడిపై తీర్చుకోవాలని ఇమ్రాన్ ఖాన్ పథకం వేశాడు.
2023 ఏప్రిల్ 20న రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం వేళ అబ్దుల్ వహీద్ మసీదుకు వెళ్లాడు. అక్కడ బాలుడిని కలిసిన ఇమ్రాన్ ఖాన్, తనకు ఒంట్లో బాగోలేదని నమ్మించి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకురమ్మని కోరాడు. బాలుడు సహాయం చేసే ఉద్దేశంతో ప్యాకెట్ తెచ్చి ఇవ్వగానే, అతడిని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. నేర తీవ్రతను కప్పిపుచ్చేందుకు బాలుడి కాళ్లు, చేతుల ఎముకలను విరిచి ఒక బకెట్‌లో కుక్కి, పాలిథిన్ సంచిలో చుట్టాడు. అనంతరం ఆటో డ్రైవర్ రఫీక్ సాయంతో ఆ మృతదేహాన్ని జింతలవాడ నాళాలో పడేయించాడు.
బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి బాలుడు వెళ్లినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం, ఇది అరుదైన కేసుగా పరిగణిస్తూ నిందితుడికి ఉరి శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఆటో డ్రైవర్‌కు ఏడేళ్ల జైలుతో పాటు రూ.వెయ్యి జరిమానా పడింది. పసివాడి ప్రాణాలు తీసిన నిందితుడికి తగిన శిక్ష పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Hyderabad,Telangana













