Hyderabad: హైదరాబాద్‌లో చెలరేగుతున్న నేపాలీ ముఠా.. వృద్ధ దంపతులను కట్టేసి భారీ దోపిడి | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

కౌకూరులోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్(68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి(58)లను దుండగులు బంధించి నగలు, నగదుతో పరారయ్యారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: నగరంలో మరోసారి నేపాలీ ముఠాలు కలకలం సృష్టించాయి. ఒకవైపు విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన దోపిడీ చోటుచేసుకుంది. కౌకూరులోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్(68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి(58)లను దుండగులు బంధించి నగలు, నగదుతో పరారయ్యారు.

పుట్టినరోజు వేడుక పేరుతో కుట్ర

ఈనాడు కథనం ప్రకారం.. కొంతకాలం క్రితం ఒక నేపాలీ జంట ప్రొఫెసర్ దంపతుల వద్ద పనిలో చేరింది. యజమానుల నమ్మకాన్ని సంపాదించిన ఈ జంట, ఇటీవల తమ బంధువు అని చెబుతూ మరో మహిళను కూడా ఇంట్లోకి రప్పించింది. సోమవారం రాత్రి సదరు నేపాలీ మహిళ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటానని దంపతులను అడగడంతో, ఏమాత్రం అనుమానం కలగని వారు అందుకు అంగీకరించారు. ఈ వేడుకల నెపంతో మరో ముగ్గురు వ్యక్తులు బంధువుల పేరుతో ఇంటికి వచ్చారు.

అదును చూసి అటాక్

వేడుకల్లో భాగంగా ప్రొఫెసర్ దంపతులు కేక్ కట్ చేసి వారితో కలిసి సంతోషంగా గడిపారు. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అసలు రంగు బయటపెట్టిన నేపాలీ బృందం, దంపతులపై దాడి చేసి వారి చేతులు కట్టేశారు. ప్రాణభయంతో వణికిపోయిన వృద్ధ దంపతులు, “మమ్మల్ని ఏమీ చేయకండి.. మీకు కావలసినవన్నీ తీసుకువెళ్లండి” అని వేడుకోవడంతో వారు ప్రాణాపాయం తలపెట్టకుండా వదిలేశారు. అనంతరం ఇంట్లోని బంగారు నగలు, విలువైన వస్తువులు దోచుకున్న ముఠా, దంపతులకు మత్తుమందు కలిపిన పదార్థాలను తినిపించి ఒక గదిలో బంధించారు.

విచారణ వేగవంతం

దుండగులు వెళ్తూ వెళ్తూ ఇంటి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి వెళ్లారు. మత్తులో ఉన్న దంపతులు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తేరుకోలేదు. స్పృహలోకి వచ్చిన ప్రొఫెసర్ కిటికీలో నుంచి స్థానికులను పిలవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ సుమతి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఐదుగురు ఈ దోపిడీలో పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానిక కాలనీవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇంట్లో పనివారిని నియమించుకునేటప్పుడు వారి పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులు తీసుకోవాలని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *