Last Updated:
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. నేపాలీ ముఠా సభ్యులు ఒక విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి, సుమారు 60 తులాల బంగారం, 20 కిలోల వెండిని దోచుకెళ్లారు.
Hyderabad: నమ్మినవారే నట్టేట ముంచారు. ఇంట్లో పని మనుషులుగా చేరి, యజమానుల నమ్మకాన్ని గెలుచుకుని, చివరకు పక్కా పథకం ప్రకారం భారీ దోపిడీకి పాల్పడ్డారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. నేపాలీ ముఠా సభ్యులు ఒక విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి, సుమారు 60 తులాల బంగారం, 20 కిలోల వెండిని దోచుకెళ్లారు.
ఈనాడు కథనం ప్రకారం.. గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న విశ్రాంత ప్రొఫెసర్ ఎన్. మురళీమోహన్ (68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి (58) దంపతుల వద్దకు ఏప్రిల్ 21న నేపాల్‌కు చెందిన మీనా కటాయత్ (మమత), ఆమె భర్త కమల్ పనిలో చేరారు. గత కొద్దిరోజులుగా వీరు దంపతుల వద్ద ఎంతో నమ్మకంగా ఉంటూ ఇంటి పనులన్నీ చక్కబెడుతున్నారు. అయితే, వీరిద్దరూ గతంలోనే మొయినాబాద్ పరిధిలో ఇలాంటి దోపిడీకి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్థులని పోలీసుల విచారణలో తేలింది.
మే 11వ తేదీ రాత్రి, మీనా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటానని, తన బంధువులను కూడా ఇంటికి పిలుచుకుంటానని మురళీమోహన్ దంపతులను నమ్మించింది. యజమానులు దానికి అంగీకరించడంతో, మరో ఐదుగురు నేపాలీ వ్యక్తులు ఆమె బంధువుల పేరుతో లోపలికి వచ్చారు. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లు నటిస్తూనే ముఠా సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. దంపతుల చేతులను వెనక్కి విరిచి కట్టేశారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉండటంతో ప్రాణభయంతో ఉన్న దంపతులు, “మమ్మల్ని ఏమీ చేయవద్దు, మీకు కావలసింది తీసుకోండి” అని వేడుకున్నారు.
ముఠా సభ్యులు గదులన్నింటినీ గాలించి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి, రూ. 30 వేల నగదుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా తీసుకున్నారు. అంతటితో ఆగకుండా, మురళీమోహన్‌కు బలవంతంగా మత్తుమందు తాగించి, దంపతులిద్దరినీ ఒక గదిలో బంధించి బయట నుంచి తాళాలు వేసి పరారయ్యారు.
మంగళవారం మధ్యాహ్నం మత్తు నుంచి కోలుకున్న మురళీమోహన్ కిటికీ గుండా పెద్దగా అరవడంతో, అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళాలు పగులగొట్టి దంపతులను రక్షించారు.
ఈ దోపిడీలో మొత్తం 5 నుంచి 7 మంది పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితుల కోసం 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పాత నేరస్థుల రికార్డులను పరిశీలిస్తూ, నేపాలీ సరిహద్దుల వైపు వెళ్లే మార్గాల్లో నిఘా పెంచారు. ఈ ఘటన స్థానిక నివాసితుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.
Hyderabad,Telangana













