Last Updated:
Hyderabad: అమెరికాలో మోసాలకు పాల్పడి దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నించిన ఒక ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
చామర్తి రామలచ్చారావు అనే ఎన్నారై పూజారిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. చామర్తి రామలచ్చారావు అమెరికాలో పూజారిగా పనిచేస్తూ అక్కడ కూడా పలు చీటింగ్‌లకు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసం చేయడమే కాకుండా తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై చేతబడి చేస్తానంటూ బాధితులను చామర్తి రామలచ్చారావు బెదిరించడం విశేషం. అమెరికాలోని ఒక ఆలయ యజమాని ఇతని అక్రమాలపై అక్కడ లీగల్‌గా కేసులు పెట్టడంతో, అక్కడి చట్టాలకు, శిక్షకు భయపడి రామలచ్చారావు గుట్టుచప్పుడు కాకుండా ఇండియాకు తిరిగొచ్చేశాడు.
ఇదిలా ఉండగా, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా రామలచ్చారావు మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుడైన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని బాచుపల్లి పిఎస్ పరిధిలో ఇతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో బాచుపల్లి పోలీసులు ఇతనిపై లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు.
శనివారం రామలచ్చారావు విమానాశ్రయం ద్వారా ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నించగా, అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమాచారాన్ని బాచుపల్లి పోలీసులకు చేరవేసి, నిందితుడిని వారికి అప్పగించారు. ప్రస్తుతానికి నిందితుడు బాచుపల్లి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అమెరికాలో ఇతను చేసిన వీసా ఉల్లంఘనలు, మోసాలకు సంబంధించిన వివరాలు, ఇక్కడి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఏ రకంగా మోసం చేశాడనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
Hyderabad,Telangana













