Last Updated:
ఇన్స్పెక్టర్ జట్ల మహేందర్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ లోపలే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తుంటే, కొందరు అధికారులు మాత్రం ఆ విభాగాల ముసుగులో అవినీతి దందాలకు తెరలేపుతున్నారు. నగరంలోని అత్యంత కీలకమైన అబిడ్స్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ (సీపీఎస్) ఇన్స్పెక్టర్ జట్ల మహేందర్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ లోపలే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అబిడ్స్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇటీవలి కాలంలో ఒక సైబర్ నేరానికి సంబంధించిన కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఇన్స్పెక్టర్ జట్ల మహేందర్.. సదరు బాధితుడి కుటుంబ సభ్యులను కూడా ఈ కేసులో నిందితులుగా చేరుస్తానని బెదిరింపులకు దిగాడు. అలా చేయకుండా ఉండాలంటే రూ. 9 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా ఇవ్వాలని సదరు బాధితుడిని డిమాండ్ చేశాడు. కేసు తీవ్రతకు భయపడిన బాధితుడు, మొదట విడతగా అడిగిన మొత్తంలో రూ. 5 లక్షలను మహేందర్‌కు అందజేశాడు.
అయితే అంతటితో ఆగని ఇన్స్పెక్టర్ మహేందర్, మిగిలిన రూ. 4 లక్షల కోసం బాధితుడిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. డబ్బులు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. సీఐ వేధింపులు భరించలేకపోయిన బాధితుడు చివరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించి, తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడు.
బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. శనివారం ఏసీబీ అధికారుల సూచనల ప్రకారం.. బాధితుడు లంచం సొమ్ము రూ. 4 లక్షలను తీసుకుని అబిడ్స్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన ఛాంబర్లో కూర్చుని ఉన్న ఇన్స్పెక్టర్ మహేందర్‌కు ఆ సొమ్మును అందిస్తుండగా, ముందే పొంచి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేశారు. మహేందర్ చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, మహేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
ఇన్స్పెక్టర్ మహేందర్ అరెస్ట్ అనంతరం ఏసీబీ బృందాలు ఆయన నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులకు భారీగా అక్రమ ఆస్తులు దొరికినట్లు సమాచారం. మహేందర్ ఇంట్లో దాచి ఉంచిన మరో రూ. 13 లక్షల నగదును, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పలు విలువైన స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను (ఆస్తి పత్రాలను) కూడా ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కోణంలో కూడా ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అరెస్టు చేసిన నిందితుడిని నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
సైబర్ నేరాల నియంత్రణ కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా మార్చడంలో జాతీయ సగటు కేవలం ఒక శాతం లోపు ఉంటే, తెలంగాణలో అది ఏకంగా 17 శాతానికి పైగా ఉండి రికార్డు సృష్టించింది. ఎఫ్ఐఆర్ల నమోదులో, త్వరితగతిన స్పందించడంలో ఇంతటి ఘనత సాధించిన విభాగానికి చెందిన ఓ ఇన్స్పెక్టరే స్వయంగా లంచం దందాకు తెరలేపడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తాజా ఉదంతంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అవినీతి మకిలి అంటినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడితే వదిలేది లేదని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Hyderabad,Telangana













