Last Updated:
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గర్భాశయంలోని కణితిని తొలగించేందుకు చేసిన సాధారణ ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ వికటించి 29 ఏళ్ల వివాహిత ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సికింద్రాబాద్ ఈస్ట్మారేడుపల్లిలో చోటుచేసుకుంది.
సర్జరీ సమయంలో పేగు తెగిపోవడం, అనంతరం కుట్లు వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే తీవ్ర రక్తస్రావమై ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాలాగూడ కుత్బేగూడ ప్రాంతానికి చెందిన వికాస్, దివ్య(29) దంపతులకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లై ఇన్నేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో వారు ఈస్ట్మారేడుపల్లిలోని బృందావన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరీక్షల అనంతరం దివ్య గర్భాశయంలో ఒక చిన్న కణితి ఉందని, దానిని ల్యాప్రోస్కోపీ విధానం ద్వారా సులభంగా తొలగించవచ్చని వైద్యులు గీతాంజలి, శ్రీకాంత్ సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.














