Last Updated:
IND vs ENG: టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) గెలిచిన తర్వాత ఒక్క విజయం లేకుండా టీమిండియా (Team India) సతమతం అవుతుంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 సిరీస్‌లో.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
కట్ చేస్తే ఎట్టకేలకు తొలి వన్డేలో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 45.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (75 బంతుల్లో 80; 11 ఫోర్లు, 1 సిక్సర్) వన్డేల్లో తన ఫామ్‌ను కొనసాగించాడు. అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) రాణించాడు. శ్రేయస్ అయ్యర్ (32) ఫర్వాలేదనిపించాడు. అక్షర్ పేటేల్ బౌలింగ్‌లో కూడా 4 వికెట్లతో మెరిశాడు. బాపూ రెచ్చిపోవడంతో టీమిండియా విజయం సులభం అయ్యింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభంలో బాగానే ఆడింది. రోహిత్ శర్మ (11) కుదురుకోవడానికి టైమ్ తీసుకోగా.. మరో ఎండ్‌లో గిల్ స్వేచ్ఛగా షాట్స్ ఆడాడు. అయితే 43 పరుగుల వద్ద రోహిత్ అవుటయ్యాడు. కాసేపటికే కోహ్లీ (5) కూడా అవుటయ్యాడు. దాంతో భారత్ 5 పరుగుల తేడాతో 2 వికెట్లను కోల్పోయింది. చాలా రోజుల తర్వాత టీమిండియా జెర్సీలో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలం కావడం అభిమానులను నిరాశ పరిచింది.
వెంట వెంటనే 2 వికెట్లు పడటంతో భారత్ అభిమానుల్లో ఆందోళన మొదలు కాగా.. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు జట్టును నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 101 పరుగులు జోడించారు. అయితే గిల్ 80 పరుగుల వద్ద క్రాంప్స్‌తో ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే శ్రేయస్ అయ్యర్, ఆ వెంటనే కేఎల్ రాహుల్ అవుటయ్యారు. అయితే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. వీరిద్దరు అజేయమైన 5వ వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో భారత విజయం ఖాయమైంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియామ్ డాసన్ (68) రాణించాడు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. ఫలితంగా ఇంగ్లండ్ తక్కువ పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రా కీలకమైన బ్రూక్ వికెట్‌ను సాధించాడు. రెండో వన్డే గురువారం జరగనుంది.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














