Last Updated:
చివరి 4 ఓవర్లలో ఇంగ్లండ్ విజయం కోసం 49 పరుగులు చేయాల్సి ఉండగా.. 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ రెండు నో బాల్స్ వేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డ బెతెల్ ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు.
IND vs ENG 2nd T20: గెలిచే మ్యాచ్‌లో భారత జట్టు చేజేతులా ఓడింది. 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేతుల్లో పెట్టాడు. అప్పటి వరకు విజయం టీమిండియా వైపే ఉండగా.. 17వ ఓవర్ వేసిన బిష్ణోయ్ టీమిండియా కొంప ముంచాడు. ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 4 ఓవర్లలో ఇంగ్లండ్ విజయం కోసం 49 పరుగులు చేయాల్సి ఉండగా.. 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ రెండు నో బాల్స్ వేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డ బెతెల్ ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి విజయాన్ని సాధించింది. జాకబ్ బెతెల్ (46 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. హ్యారీ బ్రూక్ (39), బాంటన్ (39) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్‌కు 3 వికెట్లు లభించాయి. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. వీరిద్దరు మినహా మిగిలిన బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా రవి బిష్ణోయ్.. 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు.
భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయింది. అర్ష్ దీప్ సింగ్ వేసిన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో 4 బంతుల తర్వాత జాస్ బట్లర్ (0) కూడా డకౌట్ అయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇక్కడి నుంచి హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడాడు. జాకబ్ బెతెల్ తో కలిసి మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అయితే అక్షర్ పటేల్ బ్రూక్‌ను అవుట్ చేశాడు. అనంతరం బాంటన్‌తో కలిసి జాకబ్ బెతెల్ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన బెతెల్ టాప్ గేర్లో పరుగులు సాధించాడు. బాంటన్ అవుటైన తర్వాత భారత్ కమ్ బ్యాక్ చేసింది. అయితే 17వ ఓవర్లో రవి బిష్ణోయ్ 29 పరుగులు సమర్పించుకోవడంతో భారత ఓటమి ఖాయమైంది.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 49; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. శ్రేయస్ అయ్యర్ (37) ఫర్వాలేదనిపించాడు. చివర్లో తిలక్ వర్మ (11 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆఖరి ఓవర్లో దంచి కొట్టాడు. ఫలితంగా భారత్ భారీ స్కోరును సాధించింది. తొలి మ్యాచ్ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 14; 2 సిక్సర్లు) నిరాశ పరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్యామ్ కరణ్ 3 వికెట్లు తీశాడు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jul 04, 2026 10:40 PM IST













