India Voter List Update: SIR అవసరం ఏంటీ.. ప్రతీ పౌరుడికి దీని వల్ల లాభమా..? నష్టమా..? | తెలంగాణ వార్తలు | ACTPnews

India Voter List SIR


Last Updated:

India Voter List Update: ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా అర్హులైన ప్రతీ పౌరుడికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంగా మొదలైన ప్రక్రియే సర్()స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. తెలుగులో చెప్పాలంటే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ. దేశంలోని ప్రతి ఓటరు జాబితా శుద్ధికి ‘సర్‌’ (SIR) ఒక అస్త్రం పని చేస్తుంది.

India Voter List SIR
India Voter List SIR

భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈదేశంలో జీవించే ప్రతీ పౌరుడికి రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రాధమిక హక్కులు కల్పించబడ్డాయి. అందులో ప్రధానమైనది ప్రజల్ని పాలించే పాలకులను ఎన్నుకునే ఓటు హక్కు. ఈ ఓటు హక్కు దేశంలోని ప్రతీ అర్హుడైన వ్యక్తికి కల్పించాలని.. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా చూసేందుకు లక్ష్యంగా మొదలైన ప్రక్రియే సర్(SIR)స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. తెలుగులో చెప్పాలంటే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ. దేశంలోని ప్రతి ఓటరు జాబితా శుద్ధికి ‘సర్‌’ (SIR) ఒక అస్త్రం పని చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్, ఆయా ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయి. సర్ అంటే ఓట్ల తొలగింపు అనే సంకోచం, సందేహాన్ని ప్రజల్లో తొలగించేందుకు తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రణాళికను మొదలుపెట్టింది.

లక్ష్యం అదే ..

రాష్ట్రంలో ప్రతి అర్హుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకమైన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (Special Intensive Revision – SIR)ను వేగవంతం చేసింది.ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ‘సర్‌’ ప్రక్రియపై ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మండలాల్లో ఓటరు వివరాల సమగ్ర ధృవీకరణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బోగస్ ఓట్లు, అనర్హుల ఓట్లకు చెక్ పెట్టడంతో పాటుగా ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సరైన, పారదర్శకమైన ఓటరు జాబితానే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని రాష్ట్ర ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఓటరు వివరాల పరిశీలన, డూప్లికేట్ నమోదుల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఇందులో భాగంగా సాగుతోంది.

20 ఏళ్ల తర్వాత ఎందుకు అవసరమైంది..?

ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితా సమగ్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గతంలో 2002 వరకు ఈ ‘సర్‌’ (SIR) ప్రక్రియ ఒక సాధారణ కార్యక్రమంగా క్రమం తప్పకుండా కొనసాగింది. అయితే దాదాపు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సమగ్ర ధృవీకరణ అవసరం ఏర్పడింది. కాలానుగుణంగా జనాభాలో వచ్చిన మార్పులు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు విపరీతంగా పెరగడం వల్ల ప్రస్తుత ఓటరు జాబితాల్లో అనేక లోపాలు, వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని అధికారులు గుర్తించారు.

పెరిగిన డూప్లికేట్ నమోదులు..

వేగవంతమైన పట్టణీకరణ కారణంగా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచూ నివాసాలు మారుస్తున్నారు. అలాగే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం సొంత రాష్ట్రాలు దాటి వెళ్లే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ మారుతున్న పరిస్థితుల వల్ల ఒకే వ్యక్తి పేరు పాత నివాస స్థలంలోనూ, కొత్త ప్రాంతంలోనూ… ఇలా రెండు చోట్లా నమోదు అయ్యే అవకాశాలు అధికమయ్యాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా డూప్లికేట్ నమోదులు పెరగడం ఎన్నికల పారదర్శకతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎన్నికల సంఘం భావిస్తోంది. దానికి చెక్ పెట్టడానికి ఈ సర్ ను సమర్ధవంతంగా అప్లై చేయాలని భావిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్.

రాజకీయ పార్టీల సందేహాలు..

ప్రస్తుత ఓటరు జాబితాల నాణ్యత, విశ్వసనీయతపై వివిధ రాజకీయ పార్టీలు పలుమార్లు బహిరంగంగానే సందేహాలు వ్యక్తం చేశాయి. ఓటరు జాబితాల్లో మరణించిన వారి పేర్లు అలాగే కొనసాగడం, ఓటు హక్కుకు అర్హత లేని వ్యక్తుల పేర్లు నమోదు కావడం, ఒకే వ్యక్తికి ఉన్న డూప్లికేట్ పేర్లను తొలగించకపోవడం వంటి అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ‘SIR’ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత పెరిగింది.

తొలగింపులు, సవరణలు జరిగేదిలా..

ఈ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా మరణించిన వారి పేర్లను జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో, వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన ఒకే వ్యక్తి వివరాలను (డూప్లికేట్లను) సాంకేతికత, బూత్ స్థాయి అధికారుల (BLO) ద్వారా గుర్తించి తీసివేస్తారు. చట్టప్రకారం అర్హత లేని వ్యక్తుల నమోదులను కూడా రద్దు చేస్తారు. అదే సమయంలో కొత్తగా 18 ఏళ్లు నిండి ఓటు హక్కుకు అర్హత సాధించిన ప్రతి పౌరుడి పేరును తప్పనిసరిగా జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

ప్రజలకు అధికారుల కీలక సూచనలు..

ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి పౌరుడు ప్రస్తుత ఓటరు జాబితాలో తమ వివరాలు సరిగా ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ పేరు, చిరునామా, వయస్సు, ఫోటో వంటి వివరాలలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా… వాటిని వెంటనే సవరించుకోవడానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

ప్రజాస్వామ్యానికి బలమైన అడుగు..

ఈ ‘సర్‌’ (SIR) ప్రక్రియ గనుక పూర్తి స్థాయిలో విజయవంతమైతే భవిష్యత్తులో జరిగే ఎన్నికలు మరింత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది. ఓటరు జాబితాలో కేవలం నిజమైన, అర్హులైన ఓటర్లు మాత్రమే మిగలడం వల్ల ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం రెట్టింపు అవుతుంది. అర్హులందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా సరైన వాతావరణం కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఎన్నికలు నిర్వహించే సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *