Last Updated:
ఐపీఎల్ 2026 ఫైనల్ పోరును ముగించుకుని హోటల్‌కు వెళ్తున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లకు, సపోర్ట్ స్టాఫ్‌కు పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు కొద్దిసేపటికే ఒక ఊహించని ప్రమాదం ఎదురైంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి మ్యాచ్ ముగించుకుని ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్‌కు తిరిగి వెళ్తుండగా వారి టీమ్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే, అప్రమత్తమైన సిబ్బంది ఆటగాళ్లందరినీ వెంటనే సురక్షితంగా కిందకు దించేయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.
బస్సులో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల క్షణాల వ్యవధిలోనే లోపల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది వాహనం నుండి కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యామ్నాయ బస్సు అందుబాటులో లేకపోవడంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్రాంచైజీ యాజమాన్యం వేరే బస్సును ఏర్పాటు చేయడంతో అందరూ సురక్షితంగా హోటల్‌కు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు.
ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ కేవలం 155/8 పరుగులకే పరిమితమవగా.. ఆర్సీబీ ఆ లక్ష్యాన్ని ఛేదించి వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. మైదానంలో ఓటమి బాధతో ఉన్న టైటాన్స్ జట్టుకు, ఈ బస్సు ప్రమాదం మరింత ఆందోళన కలిగించింది.
గత కొద్దిరోజులుగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రయాణ షెడ్యూల్ చాలా భారంగా మారింది. మే 26న ధర్మశాలలో ఆర్సీబీతో క్వాలిఫైయర్-1 ఆడిన జట్టు, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు మే 27న ముల్లాన్‌పూర్‌కు ప్రయాణమైంది. అక్కడ మే 29న మ్యాచ్ ముగిశాక, మే 30న అహ్మదాబాద్ బయలుదేరాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం వల్ల వారి చార్టర్డ్ ఫ్లైట్ దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. దీనివల్ల శనివారం అర్థరాత్రి మాత్రమే వారు అహ్మదాబాద్ చేరుకోగలిగారు. ఈ విపరీతమైన అలసట వల్లే ఫైనల్లో జట్టు ఘోరంగా విఫలమైందా? అని మ్యాచ్ అనంతరం విలేకరులు ప్రశ్నించగా.. గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఆ నెపాన్ని షెడ్యూల్పైకి నెట్టడానికి నిరాకరించారు. “ఆర్సీబీ చాలా బాగా ఆడి గెలిచింది. వరుస మ్యాచ్‌ల వల్ల మేము అలసిపోయామని చెప్పి వారి గెలుపు క్రెడిట్‌ను తగ్గించలేము. మా స్కోరు తక్కువైనప్పటికీ మా బౌలర్లు పోరాడారు” అని సోలంకి వ్యాఖ్యానించారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













