Last Updated:
Iran News: ఓవైపు ఇరాన్ శోకసంద్రంలో ఉంటూ.. అనేక మందికి అంత్యక్రియలు జరుపుకుంటోంది. మరోవైపు అమెరికాను రెచ్చగొడుతూ దాడులు చేయిస్తుండటం కలకలం రేపుతోంది. ఇరాన్ చేయించిన పిడికిలి చెయ్యి గుర్తు సింబల్ కూడా.. ట్రంప్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇరాన్‌లో దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న ఈ సమయంలో హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC).. జలసంధిలో తిరిగే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోందని అమెరికా అధికారులు వెల్లడించారు.
హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియా వార్తలు తెలిపాయి. ఒక ట్యాంకర్ ఒమన్ తీరానికి సమీపంలో మంటల్లో చిక్కుకుందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) సెంటర్ వెల్లడించింది. ఈ దాడులకు IRGC కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణనష్టం వివరాలు ఇంకా స్పష్టం కాలేదు, అయితే పర్యావరణ ప్రభావం లేదని UKMTO తెలిపింది. ఈ ఘటనలు అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవలి అవగాహన ఒప్పందాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో భారీ ఎత్తున జరుగుతున్నాయి. లక్షల మంది ప్రజలు నల్ల దుస్తుల్లో హాజరై ఆయన శవపేటికను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియల్లో ట్రంప్‌పై “కిల్ ట్రంప్” నినాదాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ కొత్త నాయకత్వం.. ఈ కార్యక్రమాలను దేశ ఐక్యతను ప్రదర్శించేందుకు ఉపయోగిస్తోంది. జస్ట్ 4 రోజుల్లో ఒక విగ్రహాన్ని తయారుచేయించింది. అది చెయ్యి పిడికిలి గుర్తు ఉన్న విగ్రహం. దాని ద్వారా.. అమెరికాకి తాము ఐక్యంగా ఉన్నామనే సంకేతం పంపింది ఇరాన్. ఇరాన్ సైనికాధికారులు కూడా అమెరికా, ఇజ్రాయెల్‌కి హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మళ్లీ హెచ్చరికలు చేశారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని అన్నారు. అవసరమైతే “పని పూర్తి చేస్తాం” అని హెచ్చరించారు. “గంటల్లో వారి వంతెలు కూల్చేస్తాం, విద్యుత్ సరఫరా నిలిపేస్తాం” అని ట్రంప్ మీడియాతో చెప్పారు. ఖమేనీ అంత్యక్రియల సమయంలో “మంచివాళ్లం కాబట్టి విరామం ఇచ్చాం” అని కూడా వ్యాఖ్యానించారు. ఇరాన్ హర్మూజ్ తమ కంట్రోల్‌లో ఉండాలని కోరుకుంటోంది. అమెరికా మాత్రం ఆ మార్గాన్ని స్వేచ్ఛగా ఉంచాలని ఒత్తిడి చేస్తోంది.
తాజా ఇరాన్ దాడులతో.. అనేక నౌకలు వెనక్కి వెళ్తున్నాయి. ఇలా దాడులు చెయ్యడం ద్వారా ఇరాన్.. హార్ముజ్ జలసంధిపై తమ పట్టు తగ్గిపోకుండా చూసుకుంటోంది. ఐతే.. ఇది అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్ వేస్తుంది. ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఇరాన్ ఈ దాడులు చేసిందనే వాదన తెరపైకి వస్తోంది. మొత్తంగా ఈ రెండు దేశాల మధ్యా ప్రశాంతత మాత్రం లేదు. పైకి కాల్పుల విరమణకు అవగాహనా ఒప్పందం (MoU) కుదురుతోంది అని చెప్పినా.. తెరవెనక ఎవరికి వారు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అందువల్ల ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













