Last Updated:
ఇరాన్ నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లతో అమెరికాకు చెందిన ఒక వాణిజ్య నౌకపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లు నౌకకు చేరుకునేలోపే అమెరికా బలగాలు వాటిని కూల్చివేశాయి.
అమెరికా తాజాగా ఇరాన్‌పై మరోసారి దాడులు నిర్వహించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు రాయిటర్స్‌కు ఒక అమెరికా అధికారి తెలిపారని న్యూస్ 18 ఇంగ్లీష్ రాసింది. అమెరికా సైనిక దళాలు, హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతకు ముప్పుగా మారిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ మైన్లు అమర్చే నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
ఇరాన్ నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లతో అమెరికాకు చెందిన ఒక వాణిజ్య నౌకపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లు నౌకకు చేరుకునేలోపే అమెరికా బలగాలు వాటిని కూల్చివేశాయి. అదనంగా, మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న మరో ఇరానియన్ డ్రోన్ లాంచింగ్ యూనిట్‌పై కూడా అమెరికా సైన్యం దాడి చేసినట్లు తెలిపారు.
ఈ దాడుల అనంతరం హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఇరాన్ నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్ తూర్పు ప్రాంతంలో మూడు భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1:30 గంటల సమయంలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయని, దీంతో ఆ ప్రాంతంలో గగనతల రక్షణ వ్యవస్థలు కొద్దిసేపు అప్రమత్తమయ్యాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు అనుబంధంగా ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ తాజా దాడులకు కేవలం రెండు రోజుల ముందు కూడా అమెరికా దక్షిణ ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై “సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్” పేరుతో దాడులు నిర్వహించింది. సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ, “ఈ ఖచ్చితమైన దాడుల్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న ఇరానియన్ నౌకలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నాం. ఇరాన్ బలగాల నుంచి అమెరికా సైనికులకు తలెత్తిన తక్షణ ముప్పును నివారించేందుకే ఈ ఆపరేషన్ చేపట్టాం” అని ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు.
ఇదిలా ఉండగా, అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, తగిన ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. “గత 48 గంటల్లో హోర్మోజ్‌గాన్ ప్రాంతంలో అమెరికా కాల్పుల విరమణను ఘోరంగా ఉల్లంఘించింది. ఈ దాడుల వల్ల కలిగే అన్ని పరిణామాలకు అమెరికానే బాధ్యత వహించాలి” అని ఇరాన్ పేర్కొంది.
ఇక హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశం అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన వివాదంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే సాగుతుండటంతో దీనికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేసి ఆ ఆదాయాన్ని ఒమాన్‌తో పంచుకోవాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం. యుద్ధాన్ని ముగించే ఒప్పందంలో ఇదీ భాగమని ఇరాన్ పేర్కొంది.
అయితే ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది. హోర్ముజ్ జలసంధిపై ఎవరూ నియంత్రణ సాధించలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. “దానిని ఎవరూ నియంత్రించరు. మేము కేవలం పర్యవేక్షిస్తాం, కానీ నియంత్రణ మాత్రం ఎవరికీ ఉండదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













