Last Updated:
Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కాణిపాకం చేరుకున్న ఆయనకు ఆధ్యాత్మికత అధికారిక గౌరవ మర్యాదలతో కూడిన ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు కాణిపాకం చేరుకోగానే, ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) పెంచల కిషోర్, ఇతర ఉన్నతాధికారులు వారికి సాదరంగా గజ స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ వారిని ఆలయ ప్రాంగణంలోకి ఆహ్వానించారు. మాడ వీధుల్లో ఉన్న అద్భుతమైన శిల్పకళా సౌందర్యాన్ని, ఆలయ రాజగోపుర వైభవాన్ని వారు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జ్ఞానేష్ కుమార్ గారు ఒక సాధారణ భక్తుడిలా వినాయక స్వామి వారిని దర్శించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. గర్భాలయంలో స్వయంభూగా వెలిసిన వినాయక స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి, స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. గర్భగుడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద నిలబడి, మనసారా స్వామివారిని వేడుకున్నారు. ప్రధాన ఆలయంతో పాటు కాణిపాకం ప్రాంగణంలోని ఇతర ఉప ఆలయాలను సందర్శించి దర్శనం చేసుకున్నారు.
దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని వారికి అందజేశారు. అంతకుముందు, జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ కాణిపాకం అతిథి గృహానికి చేరుకున్నప్పుడు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ తరపున ఘన స్వాగతం లభించింది. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడీ, రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు ఇదొక నూతన ఆరంభం. ప్రతి ఓటరు ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వామి కావాలి. ఇది కుటుంబ ఓటర్లందరికీ ఒక కొత్త దినమని అన్నారు.
ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా నిన్న తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని, ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నానని, ఇప్పుడు కాణిపాక వినాయకుని దర్శనంతో తన పర్యటన ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana












