Last Updated:
నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తన సహచరుడు డి.కె. శివకుమార్‌కు సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు.
Karnataka politics: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన అనంతరం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డి.కె. శివకుమార్ ఏకగ్రీవంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తన సహచరుడు డి.కె. శివకుమార్‌కు సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందేశంలో శివకుమార్ నాయకత్వ పటిమను శ్లాఘించడమే కాకుండా, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిద్ధరామయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
శివకుమార్‌ను ‘కామ్రేడ్’ (సహచరుడు) అని సంబోధిస్తూ సిద్ధరామయ్య తన లేఖను ప్రారంభించారు. “కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు ప్రియమైన శివకుమార్‌కు నా హృదయపూర్వక అభినందనలు. నీతో కలిసి పనిచేసిన సహచరుడిగా నీలో ఉన్న అపారమైన క్రియాశీలతను, అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాన్ని, కాంగ్రెస్ పార్టీ పట్ల నీకున్న తిరుగులేని నిబద్ధతను నేను చాలా దగ్గరగా గమనించాను. ఈ శక్తులన్నీ మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పూర్తిగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని గుర్తుచేసుకుంటూ.. “మొత్తం 8 సంవత్సరాల పాటు నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని కర్ణాటకను ఒక సంపన్నమైన, స్వయం సమృద్ధ గల గౌరవప్రదమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినందుకు నేను గర్విస్తున్నాను. ఈ రోజు దేశంలోనే ఆదాయ పరంగా కర్ణాటక అగ్రస్థానంలో నిలవడమే కాకుండా.. సంపద, అధికారం, అవకాశాలను సమానంగా పంపిణీ చేయడంలో దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. మనం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తుండటం మనందరికీ గర్వకారణం” అని తెలిపారు.
ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕಾಂಗ ಪಕ್ಷದ ನಾಯಕರಾಗಿ ಆಯ್ಕೆಯಾಗಿರುವ ಸಂಗಾತಿ ಡಿ.ಕೆ.ಶಿವಕುಮಾರ್ ಅವರಿಗೆ ಹಾರ್ದಿಕವಾದ ಅಭಿನಂದನೆಗಳು.
ಪ್ರಿಯ ಶಿವಕುಮಾರ್, ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಅದಮ್ಯವಾದ ಕ್ರಿಯಾಶೀಲತೆ, ಸಂಘಟನಾ ಚಾತುರ್ಯ ಮತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಮೇಲಿನ ಸಂಶಾಯತೀತ ನಿಷ್ಠೆಯನ್ನು ಒಬ್ಬ ಸಹದ್ಯೋಗಿಯಾಗಿ ನಾನು ಸಮೀಪದಿಂದ ಗಮನಿಸಿದ್ದೇನೆ. ಇವೆಲ್ಲದರ ಸದುಪಯೋಗ… pic.twitter.com/Hlep9qJaGF
— Siddaramaiah (@siddaramaiah) May 30, 2026
రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు శివకుమార్ చేతుల్లో ఉందంటూ సిద్ధరామయ్య భరోసా ఇచ్చారు. “ఈ అభివృద్ధి ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు నీ భుజాలపై ఉంది. దానికి కావలసిన పట్టుదల, సామర్థ్యం మరియు దూరదృష్టి నీకు ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. దేశమంతా ఆర్థిక అభద్రతతో భయాందోళనల్లో ఉన్న తరుణంలో, రాష్ట్ర ప్రజల్లో సమర్థవంతమైన పాలన ద్వారా నమ్మకాన్ని నింపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత నీపై ఉంది” అని గుర్తుచేశారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సైద్ధాంతిక పరిస్థితులపై సిద్ధరామయ్య హెచ్చరించారు. “మనం ఎన్నికల్లో గెలవవచ్చు లేదా ఓడిపోవచ్చు, కానీ సిద్ధాంతపరంగా ఎప్పుడూ ఓడిపోకూడదు. ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతపరంగా ఓడిపోతే అది మనుగడ సాగించలేదు. మన కాంగ్రెస్ పెద్దలు త్యాగాలతో నిర్మించిన సామరస్యపూర్వక భారతదేశాన్ని ఈ రోజు కులం, మతం పేరుతో ముక్కలు చేస్తున్నారు. రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారు. గాంధీని చంపిన వారు ఈ రోజు గాడ్సేను కీర్తిస్తున్నారు” అని తీవ్రంగా ఆరోపించారు.
రాజ్యాంగం అందించిన సమానత్వం, సామాజిక న్యాయం మరియు లౌకికవాద విలువలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే ఏకైక మార్గమని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను మరియు రాజ్యాంగ గౌరవాన్ని కాపాడటానికి మనం ఇప్పుడు ‘రెండవ స్వాతంత్య్ర పోరాటం’ చేయాల్సిన దశలో ఉన్నామని, ఈ పోరాటంలో కేవలం శాసనసభ్యులే కాకుండా రాష్ట్రంలోని ఏడు కోట్ల మంది ప్రజలు శివకుమార్‌కు అండగా నిలుస్తారని సిద్ధరామయ్య తన లేఖను ముగించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













