Latest Top News: తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి.. | | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు.

నీటి ప్రాజెక్టుల్ని పరిరక్షించుకోవాలి:

నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు. తుంగభద్ర.. మూడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోందన్నారు సీఎం. ఆరు నెలల్లో 33 గేట్లు అమర్చిన అందరినీ అభినందించారు చంద్రబాబు.

జలవివాదాలు పరిష్కరిద్దాం:

తుంగభద్ర నది ఒడ్డున.. బళ్లారి వేదికగా జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోంది. బళ్లారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుందని తెలిపారు.

ప్రైవేట్ కాలేజీలకు ఊరట:

ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 9లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. మంగళవారం వరకు స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.

300 బస్సుల్ని ప్రారంభించిన సీఎం విజయ్:

తమిళనాడు రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో 300 కొత్త బస్సులను సీఎం విజయ్‌ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమం తర్వాత బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులతో మాట్లాడారు. ప్రజా రవాణా మెరుపరచడం గురించి వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు.

ఆన్ లైన్‌లో వెతికి కేతన్‌ హత్య చేసిన సియా :

పుణె బిజినెస్‌మ్యాన్‌ కేతన్ అగర్వాల్‌ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన కుటుంబ సభ్యులకు నిందితురాలు సియా గోయల్ ముందే చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. అలాగే కేతన్‌ను ఎలా చంపాలనేదానిపై సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌధరీ ఆన్‌లైన్‌లో వెతికినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

వెనెజువెలాలో వరుస భూకంపాలు:

వెనెజువెలాలో సంభవించిన వరుస భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. రాజధాని కరాకస్‌కు పశ్చిమంగా కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించడంతో ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా, ఆ వెంటనే మరో నిమిషం కూడా గడవకముందే 7.5 తీవ్రతతో రెండో భూకంపం విరుచుకుపడిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ విపత్తు కారణంగా మరణాల సంఖ్య భారీగా ఉండే ప్రమాదం ఉందని యూఎస్‌జీఎస్ ప్రాథమికంగా అంచనా వేసింది.

భారీగా తగ్గనున్న బంగారం:

గత కొంత కాలంగా వరుస రికార్డులు సృష్టించిన బంగారం ధరలు ఇటీవల కొంత స్థిరపడుతున్నాయి. అయితే రాబోయే నెలల్లో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ డాయిష్ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 3,800 డాలర్ల వరకు పడిపోవచ్చు. డాయిష్ బ్యాంక్ అంచనా నిజమైతే, ప్రస్తుత డాలర్ మారకపు విలువ ప్రకారం భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.15 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

పవన్ ఓజీ 2 స్పెషల్ వీడియో :

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’. దీనికి పార్ట్‌ 2 రానుంది. అయితే ఈ సినిమా పనులు ప్రారంభమైనట్లు తెలుపుతూ చిత్రబృందం స్పెషల్‌ వీడియో విడుదల చేసింది . ‘గంభీర కథ సిద్ధమవుతోంది. తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం ఉంటుంది’ అని రాసుకొచ్చింది. పవన్‌, సుజీత్‌ స్టోరీ గురించి చర్చించుకుంటున్న ఈ వీడియోలో ‘నేను రెడీ..’ అని పవన్‌ చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

తెలంగాణకు భారీ వర్షాలు:

తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 7 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడతాయన్నారు. గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports