ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలను ఎవరూ పీకలేరు.. భవిష్యత్తులో వీళ్లకే అత్యంత డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews

ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలను ఎవరూ పీకలేరు.. భవిష్యత్తులో వీళ్లకే అత్యంత డిమాండ్! | తెలంగాణ వార్తలు


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి రంగంపై ఏఐ ఒకే విధమైన ప్రభావం చూపదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏఐ అనేది మనుషుల ఉద్యోగాలన్నింటినీ లాగేసుకోదు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మానవ భావోద్వేగాలు, శారీరక నైపుణ్యం, ఊహించని పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దానికి ఉండవు. ముఖ్యంగా మానవ నిర్ణయాలు, అనుభవం, భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాలు కీలకంగా ఉండే రంగాల్లో ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది.

భారతదేశంలో ఆరోగ్య రంగం అత్యంత సురక్షిత రంగాల్లో ఒకటిగా భావిస్తున్నారు. వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, కేర్ గివర్లు వంటి వృత్తుల్లో రోగులతో ప్రత్యక్ష సంబంధం అవసరం. రోగుల బాధను అర్థం చేసుకుని ధైర్యం చెప్పడం, అత్యవసర పరిస్థితుల్లో సర్జరీలు చేయడం ఏఐ వల్ల కాదు. ఏఐ కేవలం వ్యాధి నిర్ధారణలో సాయపడగలదు కానీ వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయలేదు. వృద్ధులకు, దివ్యాంగులకు అవసరమైన భౌతిక సహాయం, ‘హ్యూమన్ టచ్’ మనుషులు మాత్రమే ఇవ్వగలరు.మనుషుల మానసిక సమస్యలను, ఎమోషన్స్‌ను అర్థం చేసుకుని కౌన్సెలింగ్ ఇవ్వడం ఏఐకి సాధ్యం కాదు. అలాగే విద్యా రంగంలో ఉపాధ్యాయులు, శిక్షకుల అవసరం కొనసాగుతూనే ఉంటుంది. ఏఐ సహాయపడగలిగినా, పూర్తిగా మానవులను భర్తీ చేయడం కష్టమే.

వ్యవసాయం, పశుపోషణ, చేపల పెంపకం, ఉద్యానవనం వంటి రంగాల్లో కూడా మానవ అనుభవానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో వ్యవసాయం అనేది వాతావరణం, నేల స్వభావం, స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ట్రాక్టర్లు, డ్రోన్ల రూపంలో టెక్నాలజీ సాయపడినా.. పొలంలో దిగి పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీల స్థానాన్ని ఏఐ పూర్తిగా భర్తీ చేయలేదు. అదే విధంగా నిర్మాణ రంగంలో మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వెల్డర్లు, కార్పెంటర్లు వంటి నైపుణ్య కార్మికులపై డిమాండ్ కొనసాగనుంది. ఈ పనుల్లో భౌతిక నైపుణ్యం కీలకం కావడంతో ఏఐ ప్రభావం పరిమితంగానే ఉంటుంది. ప్రతి ఇల్లు, ప్రతి రిపేర్ సమస్య భిన్నంగా ఉంటుంది. ఊహించని విధంగా వచ్చే లీకేజీలు, రిపేర్లను ఏఐ రోబోట్లు వచ్చి సరిచేయలేవు. దీనికి శారీరక నైపుణ్యం, సమయస్ఫూర్తి అవసరం. మెకానిక్‌లు వాహనాల మరమ్మతులు, బ్రేక్‌డౌన్ అయినప్పుడు తక్షణ సాయం చేసేది మనుషులే.

అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే వృద్ధాప్య కార్మికుల సమస్యను, నైపుణ్యం కలిగిన కార్మికుల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా కొన్ని రంగాల్లో కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే యువత కంటే పదవీ విరమణ పొందుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఈ పరిణామాల వల్ల ప్లంబర్ల కొరతతో రిపేర్ల కోసం నిరీక్షణ, ఎలక్ట్రీషియన్ల లేమితో గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో జాప్యం, టెక్నీషియన్ల కొరతతో పారిశ్రామిక కార్యకలాపాల్లో ఆలస్యం, నర్సుల కొరతతో వైద్య వ్యవస్థపై తీవ్ర భారం పడుతోంది. ఇవి ఎప్పుడో భవిష్యత్తులో రాబోయే సమస్యలు కావు.. దైనందిన జీవితాన్ని, దేశ ఆర్థిక ఉత్పాదకతను నేరుగా ప్రభావితం చేస్తున్న సవాళ్లు.

ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలను ఎవరూ పీకలేరు.. భవిష్యత్తులో వీళ్లకే అత్యంత డిమాండ్!

అలాగే న్యాయరంగం, భద్రతా రంగం, సైన్యం, పోలీసు శాఖ, అగ్నిమాపక సేవలు వంటి విభాగాల్లో కూడా మానవ నిర్ణయాలు, బాధ్యత, పరిస్థితులకు అనుగుణంగా స్పందించే సామర్థ్యం అవసరం. ప్రమాద సమయాల్లో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకుని, ప్రాణాలకు తెగించి కాపాడే ఈ వృత్తుల్లోకి ఏఐ రాలేదు. అలాగే కళలు, సినిమా, సంగీతం, రచన, సృజనాత్మక రంగాల్లో మానవ ఊహాశక్తి, భావోద్వేగ వ్యక్తీకరణకు ప్రత్యామ్నాయం ఇప్పటికీ లేదు. టీచర్లు.. ముఖ్యంగా ప్రైమరీ, స్పెషల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. పిల్లల మనస్తత్వాన్ని బట్టి పాఠాలు చెప్పడం, వారిని మోటివేట్ చేయడం ఏఐ చేయలేదు. ఏఐ కేవలం సమాచారాన్ని ఇస్తుంది, కానీ గురువులా విలువలని నేర్పి దారి చూపలేదు. మనుషుల్లో స్ఫూర్తిని నింపి, వారిలో దాగున్న సామర్థ్యాన్ని బయటకు తీసేది తోటి మనుషులే. అందుకే లైఫ్ కోచ్‌లు, స్పోర్ట్స్ కోచ్‌లకు ఆదరణ ఉంటుంది. పెళ్లిళ్లు, వేడుకలను దగ్గరుండి నడిపించడం, వంటల్లో మనుషుల అభిరుచికి తగ్గ రుచిని తీసుకురావడం ఏఐ చేయలేదు. అందుకే ఈవెంట్ మేనేజర్లు, చెఫ్‌లకు డిమాండ్ ఉంటుంది.

‘‘ఏఐ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని అన్నారు, ఇంటర్నెట్ వస్తే అవకాశాలు తగ్గిపోతాయని అన్నారు. కానీ ప్రతి మార్పు కొత్త అవకాశాలను సృష్టించింది. ఈరోజు కూడా అదే జరుగుతోంది. సాఫ్ట్‌వేర్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, డేటా సైన్స్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా, హెల్త్‌కేర్ అయినా — రంగం ఏదైనా సరే, నేర్చుకోవడం అనే పని చేస్తే భవిష్యత్తు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఏఐ కంటే శక్తివంతమైనది ఒకటే… కొత్త విషయాలు నేర్చుకుని, పరిస్థితులకు అనుగుణంగా మారగల మనిషి’’ అని ఫ్రంట్‌లైన్స్ ఎడ్యుటెక్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ సెక్యూరిటీ సాయికుమార్ గౌరు తెలిపారు.

భారతదేశానికి ఇంజనీర్లతో పాటు నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణుల అవసరం ఎంతో ఉంది. పాలిటెక్నిక్, ఐటీఐలను తక్కువ చేసి చూడకూడదు. తక్కువ ఖర్చుతో వేగంగా ఉపాధి కల్పించే ఈ కోర్సులకు ఏఐ ముప్పు కూడా లేదు. జర్మనీ తరహాలో వృత్తివిద్య పట్ల ఉన్న చులకన భావాన్ని మార్చాలి. తయారీ రంగంలో భారత్ ఎదగాలంటే మౌలిక సదుపాయాలు, పరిశ్రమల భాగస్వామ్యంతో వృత్తి విద్యా సంస్థలను ఆధునికీకరించి, భారీగా పెట్టుబడులు పెట్టాలి. తయారీ, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి రంగాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం డిమాండ్ భారీగా పెరుగుతోంది. సర్టిఫైడ్ టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు, మెషిన్ ఆపరేటర్లు, వెల్డర్లు వంటి శిక్షణ పొందిన నిపుణుల కోసం యజమానులు చురుకుగా వెతుకుతున్నారు. అయితే అర్హత కలిగిన నైపుణ్య కార్మికుల కొరత ఇంకా కొనసాగుతుండటంతో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు ఏఐని అభివృద్ధి చేసే రంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. ఏఐ ఇంజినీరింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధన రంగాలు భవిష్యత్తులో భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఏఐ వల్ల భయపడటంకన్నా, దానితో కలిసి పనిచేసే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం భవిష్యత్తు ఉద్యోగ భద్రతకు కీలకం. చివరిగా చెప్పాలంటే.. ఏఐ మనుషులను రిప్లేస్ చేయదు, కానీ ఏఐ వాడటం తెలిసిన మనిషి, అది తెలియని మనిషిని రిప్లేస్ చేస్తాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed