Last Updated:
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే (Porsche) తన ఉద్యోగులకు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 9,000 మందిని తొలగించాలని నిర్ణయించిన సంస్థ, తాజాగా మరో 4,100 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది.
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షేలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి. వోక్స్‌వ్యాగన్ (Volkswagen) మాతృసంస్థగా ఉన్న ఈ కంపెనీ ఇప్పటికే భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ఏడాది జులైలో మొత్తం 9,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకారానికి వచ్చాయి. అయితే తాజాగా మరో 4,100 మంది ఉద్యోగులపై వేటు వేయాలని వోక్స్‌వ్యాగన్ సూపర్వైజరీ బోర్డు భావిస్తున్నట్లు జర్మన్ మీడియా నివేదించింది. దాదాపు 700 మిలియన్ యూరోల (సుమారు 803 మిలియన్ డాలర్లు) ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ తాజా కోతలు కూడా అమలైతే పోర్షేలో ఉద్యోగ నష్టాలు మరింత దారుణంగా ఉంటాయి. చైనా మార్కెట్లో కార్ల అమ్మకాలు తీవ్రంగా పడిపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) వ్యూహం బెడిసికొట్టడంతో సంస్థ ఆర్థికంగా పెను ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ కఠిన నిర్ణయాలకు సంస్థ మొగ్గుచూపుతోంది.
అయితే వోక్స్‌వ్యాగన్ మాతృసంస్థ అయినప్పటికీ, పోర్షేలో ఉద్యోగుల తొలగింపుపై కేవలం సిఫార్సు మాత్రమే చేయగలదు. నేరుగా ఆదేశాలు జారీ చేసే అధికారం దానికి లేదు. ఈ తాజా నివేదికలపై స్పందించేందుకు రెండు సంస్థల ప్రతినిధులు నిరాకరించారు. ఇప్పటికే పోర్షే సీఈఓ మైఖేల్ లీటర్స్ సంస్థను తిరిగి లాభాల బాట పట్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు వోక్స్‌వ్యాగన్ కూడా తమ లాభాల అంచనాలను భారీగా తగ్గించుకుంది. గతంలో 4 నుంచి 5.5 శాతం వరకు లాభాల మార్జిన్ ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు అది కేవలం 1 శాతానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. పోర్షే ఆస్తుల విలువ దారుణంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.














